పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ సర్కార్ పాల్పడిందని, బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు విత్ డ్రా చేయించిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అడ్డదారులు తొక్కి విజయం సాధించిందని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఎన్నో అడ్డదారులు తొక్కారని లోకేశ్ విమర్శలు గుప్పించారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామపంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి 260 ఓట్లతో గెలిచారని, అయినా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైసీపీ గెలిచినట్టు ప్రకటించారని మండిపడ్డారు. కొంతమంది అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఏపీలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని లోకేశ్ నిప్పులు చెరిగారు.
అధికార మదంతో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టించారని, అర్ధరాత్రి అధికారులను ప్రలోభపెట్టి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారని దుయ్యబట్టారు. చీకటిమాటున గెలిచామని వైసీపీ నేతలు ప్రకటించుకున్నా, పగలు ధైర్యంగా తిరగలేని పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా కొందరు అధికారులు మారారని, వారిపై ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు, ఆధారాలు పరిశీలించి రీకౌంటింగ్ కు ఆదేశించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.