ఏపీలో ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదం మార్మోగుతోన్న సంగతి తెలిసింతే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ, చికిత్సకు నిరాకరించిన పల్లా ఆస్పత్రిలోనే ఉక్కు సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. పల్లా దీక్ష భగ్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జగన్ రెడ్డి అడ్డుకోరని, అలా అని ప్రతిపక్ష పార్టీలు పోరాడితే చూసి ఓర్చుకోలేరని లోకేషన్ నిప్పులు చెరిగారు. గత 7 రోజులుగా ఉద్యమిస్తున్న పల్లా నిరాహార దీక్షను కుట్రపూరితంగా భగ్నం చేశారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన పల్లా గారి పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకమని లోకేష్ కొనియాడారు.
మరోవైపు, తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఫేక్ వెబ్ సైట్లతో, ఫేక్ పర్సంటేజీలతో ప్రచారం చేసుకుంటోందని లోకేష్ ఎద్దేవా చేశారు. 92 శాతం పంచాయతీలు గెలిచామని చెబుతున్నారని, కానీ, అవాస్తవాలు ఎంత ప్రచారం చేసినా వాస్తవం దాగదని లోకేష్ దుయ్యబట్టారు. తమ చిల్లర పనులతో ఓటమిని వైసీపీ నేతలు అంగీకరించారని లోకేష్ విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలతో తాము ఓడిపోయినట్టు వైసీపీ నేతలు చెప్పకనే చెప్పారని అన్నారు.
టీడీపీ అభ్యర్థి గెలిచిన ఊరు తమది కాదని కొందరు, ఓటు వెయ్యలేదని ఇల్లు, డ్రైనేజ్, మెట్లు పగలగొట్టిన వారు మరికొందరు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసి దాడులు చేసిన వారు ఇంకొందరు…ఇలా ఆలస్యంగా అయినా ఫ్యాక్షన్ పంథాలో జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఓటమిని అంగీకరించారని లోకేష్ ఎద్దేవా చేశారు. 3,4 విడతల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అని లోకేష్ జోస్యం చెప్పారు.