జగన్పై ప్రజలకు విరక్తి పెరిగిపోయి బై.. బై.. జగన్ అంటున్నారని నారా లోకేష్ అన్నారు. ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న `శంఖారావం` సభల్లో ఆయన పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శలు గుప్పించారు. 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వచ్చి.. ఏపీకి రావాల్సిన హోదా సహా అనేక హామీలను సాధిస్తానని చెప్పారని.. కానీ, ఆయన సాధించింది ఏమీ లేదని విమర్శించారు.
“లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 9 మంది ఉన్నారు. మొత్తంగా 31 మంది ఎంపీలు వైసీపీ ఉన్నారు. మరి ఏం చేశారు? ఏం సాధించారు? ఏపీకి కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేక పోయారు. ఎంపీలను తన కేసుల మాఫీ కోసం ఉపయోగించుకున్నారు. తాను ఇప్పటికి పదుల సంఖ్యలో ఢిల్లీకి వెళ్లివచ్చారు. వెళ్లిన ప్రతిసారీ.. ఏపీ గురించే మాట్లాడుతున్నట్టు ఫోజులు కొట్టారు. కానీ, ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదు. ఎంపీలను కూడా తన స్వార్థానికి జగన్ రెడ్డి వినియోగించుకున్నా డు.అందుకే వారంతా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బైబై జగన్ అంటున్నారు. ఇక, ప్రజలు కూడా.. బైబై జగన్ అంటున్నారు.. “అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
జగన్ ప్రపంచంలో ఎక్కడా లేని స్కీమ్ తీసుకువచ్చాడని నారా లోకేష్ అన్నారు. ఒక నియోజకవర్గంలో చెత్త అని తేలిన ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గానికి పంపిస్తున్నారని, ఆ చెత్త ఇక్కడ బంగారం అవుతుందా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు జగన్ అనేక నాటకాలు ఆడారని విమర్శించారు. సొంత కార్యకర్తతో కోడికత్తితో పొడిపించుకుని.. ఎన్నికలకు ముందు హై డ్రామా నడిపాడని విమర్శించారు. “బాబాయ్ ని చంపేశాడు. వాటన్నింటినీ మనపై వేశాడు. ఇప్పుడు వాటిని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది. మీరంతా టీడీపీ-జనసేన కు అండగా నిలవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి“ అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.