టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యేందుకు, చంద్రబాబు కేసుల గురించి లాయర్లతో మాట్లాడేందుకు ఢిల్లీలో లోకేష్ ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అవుతుందని లోకేష్ జోస్యం చెప్పారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన ఎంతో కాలం కొనసాగించలేరని లోకేష్ అన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే మూడు నెలల్లోపు, షెడ్యూల్ ప్రకారమే వస్తే ఆరు నెలల్లోపు జగన్ ఇంటికి పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహా నియంతలే మట్టిలో కలిసిపోయిన చరిత్ర ఉందని, వారితో పోల్చుకుంటే జగన్ ఎంత అని లోకేష్ ప్రశ్నించారు. అధికార మదంతో రాజమండ్రికి రావాలనుకున్న ఐటీ ఉద్యోగులను కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. ఇక, న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లకు నిర్బంధించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే వారిని అణిచివేయాలని చూస్తే ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుందన్నారు. ఇక, త్వరలోనే యువగళం పాదయాత్ర పున:ప్రారంభించేందుకు లోకేష్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు తర్వాత జరగబోతోన్న పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. గతంతో పోలిస్తే మరింత భారీ సంఖ్యలో జనం పాదయాత్రలో పాల్గొనే చాన్స్ ఉంది.