రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో జలజగడం సృష్టించి వేడుక చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని ఆస్తులు, కేసుల నుంచి రక్షణకు.. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షనేతగా కాళేశ్వరం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని దీక్షలు చేసిన తమరు.. సీఎం అయ్యాక అదే ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లడం రాయలసీమ ప్రజలకు చేసిన ద్రోహం కాదా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్లను మార్చి.. కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అటకెక్కించారని వంశధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని లోకేశ్ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వరప్రదాయిని వెలిగొండను అనుమతులు లేని ప్రాజెక్టుగా కేంద్రం గెజిట్‌లో పేర్కొన్నా ప్రశ్నించలేని దయనీయస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.
కొత్త, పాత ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.1.36 లక్షల కోట్లు అవసరం కాగా… ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాజెక్టుల పూర్తి అగమ్యగోచరంగా తయారైందన్నారు. టీడీపీ పాలనలో పూర్తయి, మిగిలిన చిన్న పనులు చేస్తే ప్రారంభించాల్సిన నెల్లూరు, సంగం బ్యారేజీలను ఇప్పటివరకూ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
తన నియోజకవర్గమైన కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత తమ అధినేత చంద్రబాబుదని పేర్కొన్నారు. కుప్పంకు నీరు వెళ్లకుండా అడ్డుకున్న దుష్టబుద్ధి జగన్‌ది అని విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు ఎలాగూ కట్టలేరు,.. కనీసం ఉన్న ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించలేని నిస్సహాయ ప్రభుత్వంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రకాశం బ్యారేజీ గేటు, పులిచింతల గేటు, గుండ్లకమ్మ ప్రాజెక్టు 3వ గేటు కొట్టుకుపోయి టీఎంసీల నీరు వృథా అయ్యిందన్నారు. గేట్లు బిగించలేని అసమర్థ సర్కారు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 62 మంది మరణించారని అన్నారు. కమీషన్లు పిండుకోవడం ఆపి జలవనరుల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.