టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారా లోకేష్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు. లోకేష్ కు ధైర్యం చెప్పిన పవన్…సైకో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టు రిమాండ్, జైలుకు వెళ్లడం తదితర పరిణామాలపై మాట్లాడి లోకేష్ కు ధైర్యం చెప్పారు. ప్రజా పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం సైకో జగన్ కి అలవాటుగా మారిందని విమర్శించారు. తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన పవన్ కు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు, తన తండ్రికి రిమాండ్ విధించిన నేపథ్యంలో లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మనోవేదనను బరువెక్కిన హృదయంతో లేఖ రూపంలో ప్రజలతో లోకేష్ పంచుకున్నారు.
“ఇవాళ బాధతో, బరువెక్కిన గుండెతో, కన్నీటి పర్యంతమవుతూ ఈ లేఖ రాస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు ప్రజల కోసం మా నాన్న మనసా వాచా కర్మణా తన హృదయాన్ని ధారపోయడం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా.
ఆయన ఏనాడూ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నది లేదు. కోట్లాది ప్రజల జీవితాలను బాగుచేయడం కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆయన రాజకీయాలు హుందాగా, నిజాయతీతో కూడుకున్నవి. తాను ఎవరికైతే సేవ చేశాడో వారి నుంచి లభించే ప్రేమ, కృతజ్ఞతలోంచే లోతైన ప్రేరణ పొందడాన్ని నేను చూశాను. వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పినప్పుడు చిన్నపిల్లాడిలా సంబరపడిపోయేవారు.
నేను సైతం ఆయన ఎంచుకున్న మహత్తరమైన మార్గంలో నడవాలని కోరుకున్నాను, ఆయన నుంచి ఘనమైన స్ఫూర్తిని పొందాను. అందుకోసం అమెరికాలో మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకుని వచ్చేశాను. ఇది చాలా కఠిన నిర్ణయం అయినప్పటికీ, మన దేశం పట్ల, మన వ్యవస్థల పట్ల, మన దేశ వ్యవస్థాపక సూత్రాల పట్ల, అన్నింటికి మించి మన రాజ్యాంగం పట్ల విశ్వాసం నన్ను ముందుకు నడిపించింది.
ఇవాళ మా నాన్న చేయని తప్పుకు రిమాండ్ కు వెళుతున్నారు. నా రక్తం ఉడికిపోతోంది, నా కోపం కట్టలు తెంచుకుంటోంది. ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలకు అంతే లేదా? దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఎంతగానో తపించి, వారి అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన మా నాన్న వంటి వ్యక్తికి ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? అసలు, దీన్ని ఎందుకు భరించాలి?
ఆయనెప్పుడూ విద్వేష రాజకీయాలకు పాల్పడలేదు, విధ్వంసక చర్యలకు దిగలేదు. మరి అభివృద్ధిని కాంక్షించినందుకు, ఇతరుల కంటే ముందే మన ప్రజలకు సంక్షేమ ఫలాలు, అవకాశాలు అందాలని పరితపించినందుకు ఇలా జరిగిందా? ఇవాళ జరిగిందంతా చూస్తుంటే ఒక నమ్మకద్రోహంలా అనిపిస్తోంది. కానీ మా నాన్న ఒక పోరాట యోధుడు. నేను కూడా మా నాన్న లాంటివాడ్నే.
ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్ప శక్తితో, తిరుగులేని శక్తిలా ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలసి రండి… అందుకు ఇదే నా పిలుపు” అని లోకేష్ తన లేఖలో రాశారు.