యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర తొమ్మిదో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. ఈ రోజు బంగారుపాళ్యం మండలం తుంబ కుప్పం క్రాస్ రోడ్డు వద్ద నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపైనా.. ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. తాను పాదయాత్ర మొదలు పెట్టి ఇంకా వంద కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదని.. ఇప్పటికే తన మీద పదహారు కేసులు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.
అంతేకాదు తన పాదయాత్రకు సంబంధించిన రెండు సౌండ్ సిస్టం వాహనాల్ని కూడా పోలీసులు ఎత్తుకెళ్లారన్నారు. వాటితోపాటు తన స్టూల్ ను కూడా ఎత్తుకెళ్లారన్న ఆయన.. తనను అడిగితే పోలీసులకు పంపుతాను కదా? అంటూ పోలీసులకు చురకలు అంటించారు. ‘మీ ఎస్పీకి స్టూల్ కావాలంటే నన్ను అడగమనండి. నేను పంపుతాను కదా? అంతేకానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో వ్యవసాయ మంత్రి ఉన్నారని.. ఆయన కోర్టులోనే దొంగతనానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళతారని..కానీ ఆయన మాత్రం ఏకంగా కోర్టులోనే దొంగతనం చేస్తాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అన్నదాత కంట కన్నీరు దేశానికి మంచిది కాదన్న లోకేశ్.. రైతులు పండించే పంటలే అందరూ తినాలని.. ముఖ్యమంత్రి జగన్ నువ్వు వారు పండించే పంటలు కాకుండా ఇంకేమైనా తింటావా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ తన సామాజిక వర్గానికి చెందిన నేతలకు నెలకు రూ.3 లక్షల జీతం.. కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారని.. ఈ సలహాదారుల వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగమైనా ఉందా? అన్న లోకేశ్.. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలు ఇచ్చి.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక తాడేపల్లికే పరిమితమయ్యారన్నారు.పాదయాత్రలో భాగంగా రోజులు గడుస్తున్న కొద్దీ.. లోకేశ్ మాటల పదును పెరిగినట్లుగా చెబుతున్నారు.