ఏపీలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి…అభ్యర్థులను బెదిరించినా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు చెప్పుకోదగ్గ స్థాయిలో గెలుపు బావుటా ఎగురవేశారని టీడీపీ నేతలు అంటున్నారు. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ ల ఉపసంహరణల కోసం బెదిరింపులు వంటివి చేశారని ఆరోపిస్తున్నారు.
ఇన్ని బెదిరింపులు చేసినప్పటికీ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఈ రేంజ్ లో విజయం సాధించారని, అటువంటివి లేకుండా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలకు వెళితే టీడీపీ మరిన్ని స్థానాలు దక్కించుకునే అవకాశముందని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఉంటే అధికార దుర్వినియోగం చేయకుండా..3,4 విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ లోకేష్ సవాల్ విసిరారు.
ఎన్నికల బరిలో నిజాయితీగా దిగితే ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేలుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం, చంపేస్తామని దబాయించి నామినేషన్లు విత్డ్రా చేయించడం కూడా విజయమేనా జగన్రెడ్డి అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు వైసీపీ వైపు లేరనడానికి పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని, మూడో విడత ఎలక్షన్లో వైసీపీకి మూడనుందని లోకేష్ ఎద్దేవా చేశారు. మరి, లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.