కష్టకాలంలో ఉన్న పార్టీని నడిపే శక్తిగా లోకేశ్ మారుతారా లేదా అన్న సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరికిందని చాలా మంది టీడీపీ లీడర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతం కన్నా వేగంగా పనిచేయడం, ఆలోచించి మాట్లాడడం, విమర్శలు తిప్పికొట్టడం అన్నవి ఇప్పుడున్న కాలంలో ఎంతో అవసరం అని, పార్టీ భవిష్యత్తు బాగుండేందుకు కూడా ఇవే ప్రభావితం చేయనున్నాయని అభిప్రాయపడుతున్నారు. లోకేశ్ నడవడిలో వచ్చిన మార్పును ప్రశంసిస్తున్నారు. ఆ వివరం ఈ కథనంలో..
టీడీపీ యువ నాయకులు లోకేశ్ తన మాటల్లో వేగం పెంచారు.ఎన్నడూ లేనంతగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. మామ బాలయ్య మాదిరి పొలిటికల్ డైలాగులు అదరగొడుతున్నారు. మొన్నటి వేళ ఓ మీడియా మీట్ లో సాక్షి ఛానెల్ మైకును చూపించి ఎక్కడున్నారండి అంటూ నవ్వులు చిందించారు. మీరు మమ్మల్ని మొన్న మరిచిపోయారు అంటూ సెటైర్లు వేశారు. ఇవి విని అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. నవ్వుల మాట ఎలా ఉన్నా లోకేశ్ తనదైన పొలిటికల్ సెటైర్లకు ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు.
యువ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ గా చేసుకుని పనిచేస్తూనే, ప్రభుత్వంలో ఉన్న లోపాలను వీలున్నంత మేర వెలుగులోకి తెస్తున్నారు. ఆధారాలతో సహా అన్నింటినీ వివరిస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని అంటూనే అందుకు తగ్గ ఆధారాలను మీడియా ముందుకు తెచ్చి వైసీపీని ఆశ్చర్యపరిచారు.
వైసీపీ పెద్దల భాగోతం ఇదే అని పేర్కొంటూ చాలా వివరాలు వెల్లడించి, తన మాటకు సరైన ఆధారం మరియు వివరం ఉన్నాయని ఇవేవీ గాలి మాటలు కావని మరోమారు టీడీపీకి విపక్షం అయిన వైసీపీకి చెప్పారు.
టెన్త్ ఫెయిల్ బ్యాచ్ అసెంబ్లీలో ఉంది అంటూ వైసీపీని ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. తాము ఏం చెప్పినా సానుకూలంగా ఆలోచించి సహేతుకత ఉందో లేదో చూసుకుని మాట్లాడడం ఓ మంచి పద్ధతి అని ఎన్నోసార్లు ఇటీవల కాలంలో జగన్ కు చెబుతూనే ఉన్నారు. వెరీ రిజనబుల్ ఫ్యాక్టర్స్ మాత్రమే తాము మాట్లాడుతున్నామని, ఆ విధంగా మాట్లాడినా కూడా వ్యక్తిగత దూషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అసలు విషయం పక్కదోవ పట్టేందుకు వైసీపీలో కొందరు ప్రయత్నిస్తున్నారని ఇటీవల వ్యాఖ్యానించారు. అదేవిధంగా అసెంబ్లీలో అర్థవంతం అయిన చర్చకు ఆస్కారం అన్నది లేదని, ఏం మాట్లాడాలన్నా వైసీపీ భజన చేశాకే మాట్లాడాల్సి వస్తుందని పెదవి విరిచారు.
తమ సభ్యులను సస్పెన్షన్ చేయించి, ఏక పక్షంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని అచ్చెన్న చేస్తున్న మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే లోకేశ్ కార్యాచరణ కూడా ఉంది. నిన్నటి వేళ మద్యం అమ్మకాలు తదనంతర పరిణామాలు, సారా మరణాలు వీటన్నంటిపై మాట్లాడేందుకు ధర్నా చేసేందుకు అచ్చెన్న ప్రయత్నిస్తే, పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. వీటిపై కూడా మాట్లాడారు.
అసెంబ్లీ నడుస్తున్నంత సేపు తండ్రి చంద్రబాబు కన్నా ఎక్కువగా పార్టీ సంబంధ వ్యవహారాల్లో చొరవ తీసుకుని అన్నీ తానై నడిపిన విధానం బాగుందని, ముఖ్యంగా యువ నాయకత్వం కూడా ఆయనతో పాటు పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతుంది అనేందుకు కారణం ఇటీవల లోకేశ్ లో వచ్చిన చిన్నపాటి మార్పేనని పార్టీ క్యాడర్ అంటోంది.