ఏపీ సీఎం జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, పోలీసులు ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ చెప్పినట్టు చాలామంది పోలీసులు నడుచుకుంటున్నారని, వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతూ టీడీపీ నేతలను వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత పట్టాభిపై పట్టపగలే దాడి జరిగిందని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ అరెస్టును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కక్షసాధిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.
అందులో భాగంగానే ఆయనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి ఘటన చక్కటి ఉదాహరణ అని మండిపడ్డారు. సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా కొందరు పోలీసులు వైసీపీ నాయకులకు వంతపాడుతూనే ఉన్నారని అన్నారు.
చేస్తున్న ప్రతి తప్పుకి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న వీడియోను లోకేష్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
అంతకుముందు, ఆళ్లగడ్డలోని పి.చింతకుంట గ్రామంలో రైతు సంజీవరెడ్డి దంపతుల ఆత్మహత్య ఘటనపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడి కోసం చేసిన రూ.11 లక్షలు అప్పులు తీర్చలేక వారు ఆత్మహత్య చేసుకున్నారని, వారి ముగ్గురు పిల్లలు అనాధలుగా మారడానికి జగన్ రెడ్డి చెత్త పరిపాలనే కారణం అని లోకేష్ నిప్పులు చెరిగారు.
ఓ వైపు జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మునిగి తేలుతున్నారని, మరోపక్క అన్నదాతలు అప్పులపాలై నేలకొరుగుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జగన్ రెడ్డి నిద్రలేస్తాడు…అని లోకేష్ ప్రశ్నించారు. సంజీవరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని రైతులకు భరోసా కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.