ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలను అక్రమ అరెస్టులు చేయిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు పోలీసులు అరెస్టు చేసిన ఘటన కలకలం రేపింది.
రెండు వర్గాల మధ్య జరిగిన గొడవతో ఏ మాత్రం సంబంధంలేని చింతమనేనని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చింతమనేని అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీ యూనిఫాం ధరించి ఆ పార్టీ నేతలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని, అలాంటి పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
వివాదం జరిగిన సమయంలో అక్కడ లేని వ్యక్తిని అరెస్ట్ చేయడం రాజారెడ్డి రాజ్యాంగంలో మాత్రమే ఉంటుందని మండిపడ్డారు. చింతమనేని అరెస్ట్ ను ఖండించిన లోకేశ్…ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు జగన్ పిరికిపంద చర్యలకు నిదర్శనమని లోకేశ్ ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ప.గో జిల్లాలోని పెదవేగి మండలం బి.సింగవరంలో చింతమనేని ఎన్నికల ప్రచారం చేశారు. చింతమనేని వెళ్లిపోయిన తర్వాత సింగవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, చింతమనేనిని అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొడవ జరిగిన సమయంలో అక్కడ లేని చింతమనేనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.