టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన సవాల్ చేశారు. సీఎం జగన్‌కు ఆయన 24 గంటల సమయం ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ సీఎం జగన్‌పై ఫైరయ్యారు.
తనపై 7 అంశాల్లో ఆరోపణలు చేశారని.. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారికి చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యానించారు. పరువు నష్టం దావా వేస్తానన్నారు.
ఇటీవల ఏపీలో కొందరు టీడీపీ నాయకులు, అప్పట్లో పనిచేసిన వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. గత చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అవినీతి జరిగిందని.. 254 కోట్ల రూపాయల్లో మెజారిటీ సొమ్మును దారి మళ్లించారనేది అభియోగం. ఈ నిధుల్లో 10 శాతం రాష్ట్ర వాటా ఉంది.
అయితే.. ఈ క్రమంలో నారా లోకేష్‌పై వైసీపీ నాయకులు విమర్శలు, ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా స్పందించిన లోకేష్.. తనపై చేసిన అవినీతీ ఆరోపణలను దమ్ముటే ఆధారాలతో నిరూపించాలని నేరుగా సీఎం జగన్‌కే సవాల్ విసిరారు. ఇందుకు 24 గంటలు సమయమిస్తున్నట్లు తెలిపారు.
ఒక్క ఛాన్స్ అని పీఠమెక్కిన జగన్ ప్రజలను పెడుతున్న బాధలన్నీ వింటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. స్థానికంగా ఇళ్ల కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇచ్చారని.. స్థానిక మహిళలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పుడొచ్చి ఇళ్లు కూలుస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన లోకేష్ పోరాటం చేసైనా సరే.. న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలో 10వేల ఇళ్లు కట్టించి తీరుతామని వాగ్దానం చేశారు.