వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజాపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు ఛెరిగారు. తనకు చీర, గాజులు పంపుతానని మహిళా మంత్రి అన్నారని, చీరలు కట్టుకొని గాజులు వేసుకునే మహిళలు చేతకాని వారా అని రోజానుద్దేశించి లోకేష్ ప్రశ్నించారు. ఓ మహిళా మంత్రి అయి ఉండి మహిళలను కించపరిచేలా మాట్లాడడం ఏమిటని మండిపడ్డారు. ఆ చీర, గాజులు పంపితే వాటిని తన అక్కచెల్లెళ్లకు ఇచ్చి వాళ్ళ కాళ్లకు మొక్కి గౌరవిస్తానని లోకేష్ అన్నారు.
అంతేగాని, మీ నాయకుడిలా తల్లిని, చెల్లిన మెడబెట్టి బయటకు గెంటను అంటూ జగన్ పై లోకేష్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మంత్రి పదవి గౌరవాన్ని కాపాడేలాగా మాట్లాడాలని రోజాకు హితవు పలికారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడని, యువత, రైతులు మధ్యతరగతి ప్రజలు అందరూ జగన్ బాధితులేనని దుయ్యబట్టారు. మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని విమర్శించారు.
3 రాజధానులు అంటూ పాట పాడుతున్న వైసిపి నేతలు ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పడేస్తున్నారని ఆరోపించారు. సీఎం అయిన దగ్గర్నుంచి మహిళల డబ్బు లాక్కుంటున్న జగన్ రెడ్డి… జాదూ రెడ్డి అని చురకలంటించారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచుతానన్న జాదు రెడ్డి తన మెడనే వంచాడని, గన్ కంటే ముందే జగన్ వస్తాడన్న సీఎం బుల్లెట్ లేని గన్ అని సెటైర్లు వేశారు.
మైసూర్ బోండాలో మైసూర్ ఉండదని జాదు రెడ్డి జాబు క్యాలెండర్లో జాబ్స్ ఉండవని లోకేష్ చురకలంటించారు. ఇంకో ఏడాది ఆగితే మన చంద్రన్న మన దేవుడు వస్తాడని ఈ పాలనను ప్రక్షాళన చేసి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తాడని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.