ఇవాల్టి రోజున దేశంలో బీజేపీ ఇంత బలంగా ఉండటమే కాదు.. దాని సమీపానికి సైతం రాజకీయ పార్టీలు రావట్లేదంటే అందుకు కారణం మోడీ అని అత్యధికులు చెబుతారు.కానీ.. ఈ రోజున బీజేపీ ఇంత బలంగా ఉండటానికి పునాదులు వేసిన అద్వానీ లాంటోళ్లను ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. ఆయనపై దశాబ్దాలుగా సాగుతున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితుడు స్థానం నుంచి నిర్దోషి స్థానానికి ఆయన వచ్చేశారు.
తొంభైరెండేళ్ల ముదిమి వయసులో కోర్టు వెల్లడించిన తీర్పు ఆయనకు ఉపశమనాన్ని కలిగించొచ్చు. కానీ.. కోర్టు నుంచి వెలువడిన తీర్పుతో అద్వానీకి కలిగిన ప్రయోజనం ఏమిటి? అన్ని చూస్తే.. శూన్యమన్న మాట చెప్పక తప్పదు. తాను దేశ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని తపించారు అద్వానీ.. అది కుదరని నేపథ్యంలో కనీసం రాష్ట్రపతి కుర్చీలో కూర్చోవాలన్న ఆయన చిరకాల వాంఛ తీరింది లేదు.
అత్యున్నత పదవులు చేతబట్టకుండా అడ్డుగా నిలిచిన ఈ కేసులో ఆయన నిర్దోషిగా నిరూపణ అయినా.. ఆయన పెద్దగా ఆనందపడే అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే.. ఈ కేసు ఆయన కలల్ని కల్లలు చేయటమే కాదు.. ఎన్నో అవకాశాల తలుపుల్ని మూసేలా చేసింది.
ఇంత జరిగిన తర్వాత.. తాను నిర్దోషినన్న కోర్టు మాటతో ఆయన మనసుకు తగిలిన గాయానికి మాత్రం సాంత్వన లభించే అవకాశం లేదనే చెప్పాలి. గెలిచి ఓడటం అంటే ఇదేనేమో?