జస్టిస్ వి.రాజగోపాల్ రెడ్డి, జస్టిస్ ఎన్.సంజీవ రెడ్డి, జస్టిస్ ఆర్. బయ్యపు రెడ్డి ఎం. నారాయణ రెడ్డి, బి సుదర్శన రెడ్డి….జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి….ఈ పేర్లన్నీ చూడగానే వీరంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనో, జగన్ హయాంలోనో ఏపీ హైకోర్టు జడ్జిలుగా పనిచేసిన వారి జాబితా అనుకుంటే మీరు ముద్దపప్పులో కాదు పెద్ద తప్పులో కాలేసినట్లే. వీరంతా 1995 నుంచి 2016 మధ్యలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్న సమయంలో ఏపీ హైకోర్టు జడ్జిలుగా నియమితులైనవారు. కానీ, వాస్తవ ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
చంద్రబాబు తనకు అనుకూలురైనవారిని, తన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే న్యాయవ్యవస్థలో జొప్పించారనే ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని, కోర్టుల్ని ప్రభావితం చేశారని గత పాతికేళ్ళుగా ఓ దుష్ప్రచారం జరగుతోంది. ఇక, జగన్ సీఎం అయిన తర్వాత ఈ ప్రచారం తారస్థాయికి చేరుకుంది.
జగన్ సీఎం అయ్యాక తర్వాత చంద్రబాబుని, టీడీపీని, కమ్మ సామాజిక వర్గాన్ని, ఓ వర్గం మీడియాను నిరంతరం దోషులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోంది. ఇక, జగన్ ఏకంగా న్యాయవ్యవస్థకే కుల గజ్జిని, కళంకాన్ని ఆపాదించి…జాతీయ స్థాయిలో అభాసుపాలయ్యారు. ఇంతకీ, ఆ ఆరోపణల్లో నిజమెంత? అసలు గణాంకాలు ఏం చెబుతున్నాయి? అన్న వివరాలను నిశితంగా పరిశీలిద్దాం.
ఉమ్మడి ఏపీ హైకోర్టు ఏర్పడ్డప్పటి నుంచి 1985 వరకూ తెలుగువారే ఎక్కువగా ప్రధానన్యాయమూర్తులయ్యారు. 1985 తర్వాత ఇంతవరకూ ఏపీ హైకోర్టుకు తెలుగు వ్యక్తి ఒక్కరు కూడా చీఫ్ జస్టిస్ అవలేదు. 1985 కు ముందు మొత్తం 17 మంది (తెలుగువారు + ఇతరులు) చీఫ్ జస్టిస్ లుగా నియమితులైతే అందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రతి ముగ్గురు చీఫ్ జస్టిస్ లలో ఒకరు రెడ్డి అన్నమాట.
ఈ ఐదుగురు సీజేలుగా ఉన్న కాలంలో రాష్ట్రానికి ఐదుగురు రెడ్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. కాబట్టి, వారంతా రెడ్డి కోటాలో వచ్చారని అంటే సబబుగా ఉంటుందా? ఇక, కాంగ్రెస్ హయాంలోనే జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ చల్లా కొండయ్య వంటి కమ్మకులస్తులు చీఫ్ జస్టిస్ లుగా పనిచేశారు. ప్రస్తుతం ఉన్నవారు కాకుండా ఇప్పటివరకూ 177 మంది హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యారు. ఇందులో 32 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
ప్రతి ఆరుగురిలో ఒక జస్టిస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారన్నమాట. దీనిని బట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిఎంలు తమ వారిని జడ్జిలుగా నియమించుకున్నారంటే వైసీపీ నేతలు అంగీకరిస్తారా? ఆ మాటకొస్తే 32 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జడ్జిలలో 10 మంది చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు నియమితులైన వారే. చంద్రబాబుకు కులపిచ్చి ఉంటే వారు నియమితులయ్యేవారా?
చివరగా ఓ మాట. ఇవన్నీ ఏవో కాకి లెక్కలు అనుకోకండి. ఇవన్నీ కోర్టు రికార్డుల ద్వారా పక్కాగా సేకరించిన వివరాలు. ఇవి చూసైనా చంద్రబాబు మీద, కమ్మ సామాజిక వర్గం మీద వైసీపీ ప్రాపగాండా ఆగాలని, కొంతమంది కళ్లు తెరుచుకోవాలని ఆశిద్దాం. అలా ఆశించడం తప్పే అయినా…ఆశిద్దాం.