ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ జఫ్తు కోసం ఏసీబీ కోర్టు అనుమతి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ గెస్ట్ హౌస్ అక్రమ మార్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పొందారని, సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో లింగమనేనికి లబ్ధి చేకూరేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకునేందుకు సీఐడీ అధికారులకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే, జప్తు చేసే ముందు రమేష్ కు నోటీసులు ఇవ్వాలని సిఐడి అధికారులకు కోర్టు స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం లేదని, ఆ ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఆ అద్దె చెల్లింపునకు సంబంధించిన ఆధారాలు చూపించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆ ఇల్లు జప్తు చేశారని అల్ప బుద్ధి ఉన్న సజ్జల శునకానందం పొందారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేత, ప్రతిపక్షం ఉండకూడదన్నది జగన్ ఉద్దేశమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రశ్నిస్తున్న వైనానికి జగన్ ఇబ్బంది పడుతున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లు జప్తు చేస్తే అది లింగమలేని రమేష్ కు ప్రభుత్వానికి మధ్య సమస్య అని అన్నారు. అందులో చంద్రబాబు నాయుడుని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతులు లేకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు ఇల్లు కట్టుకోవడం జగన్ కు ఇష్టం లేదా అని నిలదీశారు. తాడేపల్లిలో జగన్ ఇంటికి ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆఘమేఘాల మీద అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లింగమనేని గెస్ట్ హౌస్ కు అనుమతులిచ్చింది ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు.