‘లైగర్’ చిత్రం భారీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో బయ్యర్లకు దర్శకుడు పూరీ జగన్నాథ్ కొంత డబ్బు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వడం ఆలస్యం కావడంతో పూరీని బయ్యర్లు బెదిరించిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను పూరీ జగన్నాథ్ ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
‘లైగర్’ చిత్ర ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆ చిత్ర డిస్టిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబు తనను వేధిస్తున్నారని పూరీ ఫిర్యాదు చేయడం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని వారిద్దరూ మానసికంగా వేధిస్తున్నారని పూరీ ఆరోపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూరీ పేర్కొనడం సంచలనం రేపుతోంది.
వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు పూరీ విజ్ఞప్తి చేశారు. ‘లైగర్’ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని పూరీ ఆ ఆడియో టేప్ లో వాపోయిన సంగతి తెలిసిందే. తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని, తన పరువు పోతే ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించబోనని పూరీ ఆ ఆడియోటేప్ లో చెప్పారు. డబ్బులు ఇస్తానని చెప్పినా…పలువురు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడడంపై పూరీ అసహనం వ్యక్తం చేశారు.
డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తుగా భద్రత కల్పించాలని పోలీసులను పూరీ కోరారు. లైగర్ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.