ఈ ఏడాది జులై 28 న ఝార్ఖండ్‌లోని ధన్బాద్లో అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను నడిరోడ్డుమీద దారుణంగా హత్య చేసిన ఘటన పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మార్నింగ్ వాక్ చేస్తున్న జడ్జిని ఓ ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతం జడ్జిల భద్రతకు సవాల్ విసిరింది. జడ్జి వంటి హై ప్రొఫైల్ వ్యక్తి కేసును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని సీబీఐ విచారణకు ఆదేశించినా….ఆ హత్యకు పాల్పడిన నిందితుడు ఇప్పటి వరకూ అరెస్ట్ కాలేదు.
ఇలా న్యాయవ్యవస్థలకే సవాల్ గా మారిన హత్యపై, జడ్జిల ఫిర్యాదుల నేపథ్యంలో సీబీఐ తీరుపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఉదంతం మరుగున పడకముందే రాజస్థాన్ లోని బుండిలో జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారికర్‌కు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. అంతేకాదు, ఏకంగా డేట్ చెప్పి మరీ జడ్జిని లేపేస్తానంటూ ఆ నిందితుడు లేఖలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఎలాగైనా చంపేస్తానని, చేతనైతే తన నుంచి తప్పించుకోవాలని ఆ ఆకాశ రామన్న ఉత్తరంలో నిందితుడు సవాల్ విసరడం పెను ప్రకంనలు రేపుతోంది. సెప్టెంబర్ 13న తుపాకితో కాల్చి గానీ, విషమిచ్చి గానీ, వాహనంతో ఢీకొట్టి కానీ చంపేస్తామని, తాను పిరికివాడిని కాదు కాబట్టే ముందుగా చెప్పి మరీ చంపుతానంటూ బెదిరించడం సంచలనం రేపింది. ఇక, ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పామంటూ ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పడం లేఖలో కొసమెరుపు.
కోర్టులో నిందితుడికి అవకాశమిచ్చినట్లుగానే…మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి అవకాశం ఇస్తున్నామని, చేతనైతే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని సవాల్ విసిరాడా నిందితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేఖ రాసిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. అయితే, గతంలోనూ బూందీలోని మరో జిల్లా జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కూడా ఇలాంటి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది.