హఫీజ్‌పేట్ సర్వే నంబర్-80 భూవివాదం నేపథ్యంలో బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఏ1 కాగా, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ2, అఖిల ప్రియ భర్త ఏ3గా ఉన్నారు. అనారోగ్య కారణాలతో అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మొదటిసారి తిరస్కరణకు గురైంది. దీంతో, తాజాగా అఖిలప్రియ తరఫు న్యాయవాది రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు….అఖిల ప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్‌ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అఖిల ప్రియకు బెయిల్ఇవ్వొద్దని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియకు బెయిల్ వస్తే విచారణ నుంచి తప్పించుకునే అవకాశముందని, సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సాక్షుల వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అఖిల ప్రియపై తప్పుడు కేసులు పెట్టాలన్న ఆలోచన తమకు లేదని పోలీసులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అఖిలప్రియ హెల్త్ బులిటెన్ ను సమర్పించాలంటూ జైలు అధికారులను ఆదేశించింది.
మరోవైపు, కిడ్నాప్ కేసులో తన అక్కను అనవసరంగా ఇరికించారని అఖిల ప్రియ సోదరి మౌనిక ఆరోపించారు. జైలులో తన అక్కను టెర్రరిస్టుకంటే ఘోరంగా చూస్తున్నారని, గర్భవతి అయిన ఆమెకు కనీసం వైద్య సహాయం కూడా అందించడంలేదని ఆరోపించారు. అఖిలకు జైలుల్లో ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని, ఈ కేసు విషయంలో ఏపీ నుంచి ఆదేశాలు వస్తున్నాయేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. జైలులో అఖిలప్రియకు ఫిట్స్ వచ్చాయని, ఆమె ముక్కు, చెవుల నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోవడం లేదని మౌనిక అన్నారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి బ్రతికున్నప్పటి నుంచీ హఫీజ్ పేట్ స్థలంపై వివాదం ఉందని ఆమె అన్నారు. భూమా ఫ్యామిలీని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారని, ఈ విషయంలో తమకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, హఫీజ్‌పేట్‌లోని 50 ఎకరాల భూమి తమదేనని ,దానిని కబ్జా చేసి మైహోమ్స్‌కు లీజ్‌కు ఇచ్చారని అఖిలప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని కోరారు. హఫీజ్‌పేట్ సర్వే నంబర్-80 నిజాం కాలం నుంచి దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో ఉంది. కోర్టు కేసులతో.. హత్యలు-ప్రతి హత్యలతో దాదాపు డజను మందిని ఈ భూమి బలి తీసుకుంది.