ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలలో ప్రముఖ సుస్థిర వ్యవసాయ సంస్థ లారెన్స్డేల్ అగ్రో ప్రాసెసింగ్ ఇండియా (LEAF) సేవలందిస్తూ వస్తోంది. లంబసింగి, చింతపల్లి వంటి తూర్పు కనుమలలోని మారుమూల ప్రాంతాలలోని గిరిజన రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తూ వాటి పరిష్కారాలపై దృష్టి సారించింది ఈ సంస్థ.
అభివృద్ధిలో అట్టడుగున ఉన్న గిరిజన రైతులకు స్థిరమైన జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ సంస్థ లక్ష్యం. పశ్చిమ కనుమలలో ఒక దశాబ్దానికి పైగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ దశాబ్దకాలంగా 15 లక్షల మంది అట్టడుగు రైతుల జీవనోపాధిని మెరుగు పరిచింది.
గత 8 సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వంతో LEAF ఒప్పందం కొనసాగుతోంది.
ఉపాంత మరియు చిన్న సాగు భూములపై ఆధారపడిన గిరిజన రైతుల జీవితాలకు అర్ధవంతమైన మరియు స్థిరమైన మెరుగుదల తీసుకురావడమే తమ సంస్థ లక్ష్యం అని LEAF వ్యవస్థాపకుడు మరియు సీఈవో పాలెట్ విజయరాఘవన్ అన్నారు. తూర్పు కనుమల యొక్క సహజమైన రిజర్వ్ ప్రాంతాలకు సంరక్షణ అవసరమని, వాతావరణ మార్పులను కూడా పరిష్కరించే వినూత్న వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ ప్రాంత గిరిజన రైతులకు మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
ప్రత్యేకంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడానికి తమ సంస్థ ప్రణాళికలు రచించిందని తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోగల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై తమ సంస్థ ప్రధానంగా ఫోకస్ పెట్టిందని అన్నారు. సంస్థ యొక్క డిజిటలైజ్డ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ రైతులకు అధునాతన పరిజ్ఞానం మరియు సాంకేతికతలను అందజేస్తోందన్నారు. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించి మరియు అధిక-నాణ్యత, సురక్షితమైన-వినియోగ పంటల ఉత్పత్తిని నిర్ధారించేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
రైతుల జీవితాలు మార్చడానికి అనేక రకాల ఆర్థిక సేవలను ఈ సంస్థ అందిస్తోందని, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు అవసరమైన పరికరాలలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. ఆర్థిక చేరిక తమ వ్యూహానికి మూలస్తంభం అని విజయరాఘవన్ అన్నారు. రైతుల క్రెడిట్ యోగ్యతను మెరుగుపరచడం ద్వారా, ఉత్పాదకత మరియు స్థిరత్వం రెండింటినీ మెరుగుపరచడానికి అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి రైతులకు తమ సంస్థ తరపున సాయం చేస్తామని చెప్పారు.
మార్కెట్కు చేరే ఉత్పత్తులు అత్యధిక నాణ్యతతో మరియు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం ద్వారా వ్యవసాయ వర్గాలకు మాత్రమే కాకుండా వినియోగదారులకు కూడా ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు అందించడం తమ లక్ష్యమని చెప్పారు. ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతివ్వడం, సమాజ శ్రేయస్సుకు దోహదపడే కార్యక్రమాలు కూడా తమ సంస్థ చేపడుతోందని అన్నారు.