కొన్నిసార్లు చోటు చేసుకునే పరిణామాలు మహా సిత్రంగా ఉంటాయి. కాలపరీక్షలు ఎవరేంటన్న విషయంపై క్లారిటీ వస్తుంది. విజయవాడకు చెందిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావు కు అప్పట్లో లభించిన గౌరవ మర్యాదలు ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తూ టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనం గురించిన సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గా వ్యవహరించిన కాంతిరాణా టాటా ఈ న్యాయవాదికి చాలా మర్యాద ఇచ్చేవారు. ఆయన వస్తుంటే.. లేచి నిలబడేవారు.
మార్గదర్శి చిట్స్ మీద చేసిన తీవ్ర ఆరోపణల్లో ఈ న్యాయవాది కీరోల్ ప్లే చేసేవారు. విలేకరుల సమావేశాన్నినిర్వహించేవారు.. అది కూడా విజయవాడ సీపీతో కలిసి. అలాంటి న్యాయవాది ఇంట్లోనే పేకాట క్లబ్ ను ఏర్పాటు చేసిన వైనం.. తాజాగా టాస్క్ ఫోర్సు పోలీసులు దాడి చేసిన వైనంతో అందరూ నోరెళ్లబెట్టే పరిస్థితి. అతడి ఇంట్లో జూదం ఆడుతున్న 16 మందిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సదరు న్యాయవాది పారిపోయారు. అయితే.. తప్పనిసరి పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోయారు.
చిట్టి వాయిదాలు సక్రమంగా చెల్లించకుండా.. చిట్టి పాడిన తర్వాత ప్రైజ్ మనీ పొందేందుకు నిబంధనల ప్రకారం అర్హమైన ష్యూరిటీలు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో తాను చిట్టీ పాడితే మార్గదర్శి డబ్బులు ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ కాపీని పట్టుకొని మార్గదర్శి మీద కేసు నమోదుతో పాటు.. అతడ్ని పక్కన పెట్టుకొని విజయవాడ సీపీ ప్రెస్ మీట్ పెట్టటమే కాదు.. అతను ప్రెస్ మీట్ కు వచ్చేటప్పుడు లేచి నిలబడి.. సాదరంగా ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి అతను తాజాగా ఇంట్లోనే పేకాట క్లబ్ నిర్వహిస్తూ.. టాస్క్ ఫోర్సు పోలీసుల దాడిలో దొరికేశారు. ఇతగాడి వ్యవహారం తాజాగా హాట్ టాపిక్ అయ్యింది.