టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలోని పీలేరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా యువతతో ముఖాముఖి నిర్వహించిన లోకేష్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీలతో కూడా లోకేష్ భేటీ అయి వారితో మాట్లాడారు. క్రమంలోనే జగన్ పాలనపై లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో పెద్దిరెడ్డి పేట్రేగిపోతున్నారని, పుంగనూరులో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీ తప్ప మరో డైరీ లేకుండా చేశారని లోకేష్ మండిపడ్డారు.
పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్నంతకాలం పుంగనూరుకు ఏమీ రావని లోకేష్ మండిపడ్డారు. పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిపించినా ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. ఇక, పీలేరులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని మిస్బా తల్లిదండ్రులు లోకేష్ ను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. వైసీపీ నేత సునీల్ వేధింపుల కారణంగానే తమ కుమార్తె సూసైడ్ చేసుకుందని లోకేష్ ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత సునీల్ కుమార్తెకి సెకండ్ ర్యాంకు రావడంతోనే ప్రిన్సిపల్ ఒత్తిడి చేసి తమ కుమార్తెకు టీసీ ఇచ్చి పంపించారని మిస్బా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ రోజు నుంచి న్యాయం కోసం పోరాడుతున్నా వైసీపీ నేత సునీల్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. లోకేష్ ను కలిస్తే చంపేస్తాం, ఊర్లో ఉండనివ్వం అంటూ బెదిరించాలని వారు ఆరోపించారు. తమను కాపాడాలని వారు లోకేష్ ను వేడుకున్నారు. దీంతో, మిస్బా కుటుంబానికి అండగా ఉంటానని, న్యాయం జరిగేలా పోరాడతానని లోకేష్ హామీ ఇచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిస్బా మరణానికి కారకులను శిక్షిస్తామన్నారు. మిస్బా కుటుంబ సభ్యులను పరామర్శిస్తే దాన్ని రాజకీయం చేసి వారిని వేధిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.