గాయని లతా మంగేష్కర్ చనిపోయారు. తన గానంతో సుమారు 7 దశాబ్దాలు ఓలలాడించిన మధుర గాయని మరిలేరు.
1929 సెప్టెంబరు 28న జన్మించిన ఆమె 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
కోవిడ్ సోకడంతో లతా మంగేష్కర్ జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ కేండీ హాస్పిటల్లో చేరారు. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆ తరువాత ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.
ఆదివారం ఉదయం ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇండోర్ నుంచి ఇండియా అంతటికీ…
1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు లతా మంగేష్కర్.
తండ్రి దీనానాథ్ మంగేష్కర్ హిందుస్తానీ సంగీతంలో దిట్ట. మరాఠీ రంగస్థల నటుడు కూడా. ఐదుగురు పిల్లల్లో ఆమే పెద్దది.
ఆమె ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు. తమ ఇంట్లో పని మనిషి ఆమెకు మరాఠీ అక్షరమాల నేర్పించారు.
స్థానిక పూజారి ఒకరు ఆమెకు సంస్కృతం నేర్పారు. బంధువులు, ట్యూషన్లు చెప్పే గురువులు ఇతర పాఠ్యాంశాలు బోధించారు.
లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 1942లో మరణించారు. అప్పటికి లతా మంగేష్కర్ వయసు 13 ఏళ్లు.
పెద్ద కూతురుగా తల్లికి అండగా నిలుస్తూ కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత తీసుకున్నారు లతా మంగేష్కర్.
వారి కుటుంబం బొంబాయి నగరానికి వలసొచ్చింది. లత సంగీతం నేర్చుకుంటూనే మరొక వైపు సినిమాల్లో పాటలు పాడే అవకాశాల కోసం ప్రయత్నించారు.
అయితే.. 1940వ దశకం తొలి నాళ్లలో పాటలు ఎక్కువగా ఉండేవి కాదు. దీంతో సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించటం మొదలు పెట్టారు.
కానీ సినిమాల్లో నటించడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు. ఆమె మనసంతా పాట మీదనే ఉండేది. ఎనిమిది మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు.
గాయనిగా ఎవరూ సాధించలేని రికార్డులు సాధించారు.