రాబోయే ఎన్నికలే కాపులకు చివరి అవకాశమా ? అనే చర్చ పెరిగిపోతోంది. ఎలాగైనా సరే కాపులకు రాజకీయ అధికారం దక్కాల్సిందే అనే నినాదం చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే నినాదం నినాదంగా మాత్రమే మిగిలిపోతోంది. కాపుల్లో ఐకమత్యం లేకపోవటం ఒక కారణం అయితే రాష్ట్రవ్యాప్తంగా కాపునేతలు, సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల స్ధాయి నేత లేకపోవటం రెండో కారణం.
అనేక కోణాల్లో కాపులకు రాజకీయ అధికారం విషయాన్ని ఆలోచించిన కొందరు నేతలు ముందుగా మెగాస్టార్ చిరంజీవితో చర్చించారు. తర్వాత కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటి అయ్యారు. ఈమధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా సమావేశమయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాపులకు రాజ్యాధికారం దక్కాలని కాపు సామాజికవర్గంలోని ప్రముఖలందరూ చెప్పేవాళ్ళే. అయితే అందరినీ ఏకతాటిపైకి తెచ్చే వాళ్ళు ఎవరు అన్న పాయింట్ దగ్గరే ఆగిపోతోంది.
సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కొందరు పవన్ను ముందుకు తోస్తున్నారు. సినీ సెలబ్రిటీ హోదాలో, జనసేన అధినేతగా పవన్ ముందునడిస్తే మిగిలిన కాపు ప్రముఖులంతా వెంట నడుస్తారంటూ కొందరు కాపు నేతలంటున్నారు. అయితే మామూలు జనాలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేదే ప్రధాన సమస్యగా మారిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో కులపరమైన రాజకీయపార్టీ పెడితే సక్సెస్ అయ్యేది అనుమానమే.
ఎన్నికల్లో టికెట్లివ్వటం, ఓట్లు వేయించుకోవటం వరకు ఓకే. అంతేకానీ కులాల ఆధారంగా పార్టీ పెడితే సక్సెస్ అయ్యేది అనుమానమే అని కొందరు కాపు నేతలంటున్నారు. 2009లో అందరివాడుగానే చిరంజీవి ప్రాజారాజ్యంపార్టీని పెట్టినా చివరకు అది కాపుల కోసమే పెట్టిన పార్టీగా ముద్రపడిపోయింది. దాంతో జనాల ఆదరణ పెద్దగా లభించలేదు. చింరజీవిని నమ్ముకుని పార్టీలో చేరిన కాపునేతలందరి మీద బాగా దెబ్బపడిపోయింది. ఆ అనుభవంతోనే ఇపుడు పవన్ వెంట నడవటానికి చాలమంది కాపునేతలు ఇష్టపడటంలేదు.
ఏదేమైనా కాపులకు రాజ్యాధికారం అనే నినాదంతో ఓ రాజకీయపార్టీని పెట్టి వచ్చే ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నించాలనే డిమాండ్ అయితే పెరిగిపోతోంది. ఎందుకంటే 2024 ఎన్నికలే తమ ప్రయత్నాలకు చివరి అవకాశంగా కొందరు కాపు నేతలు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాపులు అధికారాన్ని అందుకోవటంలో విఫలమైతే భవిష్యత్తులో కాపుల పార్టీ, కాపులకు రాజ్యాధికారం అనే మాటను మరచిపోవచ్చనే చర్చ కాపుల్లో బాగా జరుగుతోంది. అందుకనే పూర్తిస్ధాయిలో పవన్ను కాపు నేతగానే బహిరంగంగా ప్రొజెక్ట్ చేయటానికి ప్రయత్నాలు మొదలైపోయాయి. మరి వీళ్ళ ప్రయత్నాలు ఏమవుతాయో చూడాలి.