టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి గత పదేళ్లుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. మరికొందరైతే, 2023 ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా పుకార్లు పుట్టించారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే తారక్ రావాలని, టీడీపీ పగ్గాలు కూడా లోకేశ్ కు కాకుండా తారక్ కు ఇవ్వాలని సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు వస్తుంటాయి.
అవన్నీ పుకార్లేనన్న సంగతి తెలిసిన తారక్ మాత్రం తన మానాన తాను వరుస సినిమా షూటింగులు, ప్రోగ్రామ్ లతో బిజీబిజీగా ఉన్నారు.రాజకీయాల్లోకి రావడానికి ఇది సమయం…. సందర్భం కాదని తారక్ కొద్ది నెలల క్రితం కూడా మీడియా ముఖంగా ప్రకటన చేశారు. అయితే, అసలు రాజకీయాల్లోకి మళ్లీ రానని తారక్ చెప్పకపోవడంతో ఏదో ఒక రోజు తారక్ రాజకీయాల్లోకి వస్తారని ఫ్యాన్స్ కొందరు బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ తెరంగేట్రంపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు.
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు, ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడితే బాగుంటుందని లక్ష్మీపార్వతి అన్నారు. తనకు తెలిసినంత వరకు జూ.ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం లేదని చెప్పారు. ఎన్నికల ముందు వీళ్లు చాలా అబద్ధాలు ప్రచారం చేస్తుంటారని, వాటిలో ఇది కూడా ఒకటని అన్నారు. లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తాడని భావిస్తున్నానంటూ జోస్యం చెప్పారు. దీంతో, లక్ష్మీ పార్వతి కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి.
తారక్ తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్నాడని, రాజకీయాల ఊసెత్తడం లేదని టీడీపీ అభిమానులు అంటున్నారు. అటువంటిది అనవసరంగా తారక్ రాజకీయ అరంగేట్రం గురించి ఆమె మాట్లాడడం ఏమిటని అంటున్నారు.