డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సోదరి షర్మిలతో పాటు టీడీపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు, నందమూరి కుటుంబ సభ్యులు అందరూ తీవ్రంగా ఖండించారు. అయితే, అన్నగారి పేరు మార్పుపై ఇంత రచ్చ జరుగుతున్నా సరే ఆయన సతీమణిగా చలామణి అవుతున్న లక్ష్మీపార్వతి మాత్రం ఇంతవరకు ఆ వ్యవహారంపై స్పందించలేదు.
వైసీపీ నేతగా కొనసాగుతున్న లక్ష్మీపార్వతి తన పదవి పోతుందనే ఉద్దేశంతోనే పేరు మార్పు వ్యవహారంపై స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పై లక్ష్మీపార్వతికి ఉన్న ప్రేమ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉన్నావా…అసలున్నావా అంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు లక్ష్మీ పార్వతిపై ట్రోలింగ్ మొదలెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై లక్ష్మీపార్వతి స్పందించారు.
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని లక్ష్మీ పార్వతి పరోక్షంగా సమర్థించారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగారు పేరు మార్పుపై ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం, యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించడం వంటి రెండు ఆప్షన్లలో తాను జిల్లా పేరు ఆప్షన్ నే ఎంచుకుంటానని అన్నారు.
తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే ఊరుకోనని, అటువంటి వారిపై కేసులు పెడతానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితంపై కొన్ని మీడియా సంస్థలు దాడి చేస్తున్నాయని లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇష్టానుసారంగా తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికీ లేదంటూ ఫైర్ అయ్యారు. చరిత్రను ఎవరు చెరిపివేయలేరని తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.
తనకు టెక్కలి సీటు ఆఫర్ చేసినా తీసుకోలేదని గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన స్టేట్మెంట్లు చూసి అసలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో తమ వివాహం గురించి చాలా స్పష్టంగా చెప్పారని లక్ష్మీపార్వతి అన్నారు. పేరు మార్పును సమర్థిస్తూ లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.