మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…అలియాస్ ఆంధ్రా ఆక్టోపస్…తెలుగు రాజకీయాల గురించి తెలిసిన వారెవ్వరూ ఈ పేరు మరచిపోలేరు. ఉమ్మడి ఏపీ విభజన వద్దంటూ పెప్పర్ స్ప్రేతో లగడపాటి చేసిన రచ్చ ఎవ్వరూ మరచిపోలేరు. ఇక, తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి….ఆమాట ప్రకారం అస్త్ర సన్యాసం చేశారు. దాదాపుగా 2019 ఎన్నికల తర్వాత మీడియాకు టచ్ లో లేని లగడపాటి…అడపా దడపా…మీడియా ముందుకు వచ్చినా రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడలేదు.
కానీ, కొంతకాలంగా లగడపాటి పొలిటికల్ రీఎంట్రీపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా లగడపాటి సైకిల్ ఎక్కబోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో లగడపాటి పోటీ చేస్తారని, విజయవాడ లేదా గుంటూరు ఎంపీ టికెట్ లగడపాటికి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ లలో ఒకరికి లగడపాటి ఎసరు పెట్టబోతున్నారని టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా లగడపాటి పోటీ చేయబోయే నియోజకవర్గం ఇదేనంటూ మరో ప్రచారం తాజాగా జోరందుకుంది. గుడివాడ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొడాలి నానిపై లగడపాటి పోటీ చేయబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. బూతుల మంత్రిగా, ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నానిని ఎదుర్కొనేందుకు లగడపాటి సరైనోడని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే, లగడపాటి తన పొలిటికల్ రీఎంట్రీపై ఎక్కడా నోరు విప్పడం లేదు. సడెన్ గా సర్ ప్రైజ్ ఇచ్చేలా లగడపాటి రీ ఎంట్రీ ప్రకటన ఉంటుందని టాక్. ఒకవేళ పుకార్లు నిజమై…లగడపాటి పోటీ చేస్తే…గుడివాడ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.