టాలీవుడ్లో కొంత కాలంగా రీ రిలీజ్ హంగామా నడుస్తున్న సంగతి తెలిసిందే. పాత సినిమాలను ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ షోలు వేయడం కొత్తేమీ కాదు కానీ.. ఈ ఏడాది ఈ విషయంలో చూసిన హంగామా అలాంటిలాంటిది కాదు. మహేష్ బాబు పుట్టిన రోజుకు ‘పోకిరి’ స్పెషల్ షోలతో ఆయన అభిమానులు ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తే.. దాన్ని మించిన హంగామాతో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుకు ‘జల్సా’ సినిమాతో ఫ్యాన్స్ ఇంకా సందడి చేశారు. ఆ తర్వాత మరి కొన్ని సినిమాలు ఇలా రిలీజయ్యాయి కానీ.. పై రెండు చిత్రాల మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేకపోయాయి. ఐతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు మరోసారి దండయాత్రకు సిద్ధమవుతున్నారు. రీరిలీజ్ కోసం వాళ్లు ఎంచుకున్న సినిమా అభిమానులందరికీ గూస్ బంప్స్ ఇచ్చేస్తోంది. పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటి, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అనిపించుకున్న సినిమా ఖుషి ని ఈ నెల 31న రీ రిలీజ్ చేస్తున్నారు.
‘జల్సా’కు, ‘ఖుషి’కి తేడా ఏంటంటే.. మొదటి సినిమా షోల విషయంలో మొత్తం అభిమానులే బాధ్యత తీసుకుని చేశారు. కానీ ‘ఖుషి’కి స్వయంగా నిర్మాణ సంస్థే రంగంలోకి దిగుతోంది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎం.రత్నం స్వయంగా రీ రిలీజ్ బాధ్యతను నెత్తికొత్తుకున్నారు. ఇంతకుముందు శ్రీ సూర్యా మూవీస్‌గా ఉన్న బేనర్ పేరు ఈ మధ్య ‘మెగా సూర్యా ప్రొడక్షన్స్’గా మారిన సంగతి తెలిసిందే. ఆ బేనర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ‘ఖుషి’కి సంబంధించి రీరిలీజ్ ప్రకటన వెలువడింది. చూస్తుంటే ప్లానింగ్ కొంచెం గట్టిగానే జరుగుతున్నట్లుంది. ‘ఖుషి’ ఎన్నిసార్లు చూసినా తనివి తీరని.. ఇప్పుడు చూసుకున్నా ట్రెండీగా అనిపించే ప్రేమకథ. అదే సమయంలో పవన్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉంటాయి.
ఈ సినిమాను ఫ్యాన్స్ అందరూ ఓన్ చేసుకోవడం.. థియేటర్లలో సంబరాలను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. రీరిలీజుల్లో రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి స్క్రీన్లు దక్కబోతున్నాయి. సంక్రాంతి ముంగిట ఒక రోజు ఫుల్లుగా ఈ సినిమాదే హంగామా కాబోతోంది. కాబట్టి కలెక్షన్ల పరంగానూ కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం.