ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీలో కుంపట్ల రాజకీయాలు వేడెక్కాయి. పలు జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు.
కొన్నిచోట్ల కీలక నేతలు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో వారిపై ఎమ్మెల్యేలు కత్తులు నూరుతున్నారు.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనను పదవి నుంచి దింపేశారు.
ఈ ఏడాదిలో జరిగిన పరిషత్ ఎన్నికల తర్వాత ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు.
అయితే ఆయన పదవి చేపట్టి యేడాది కూడా అవ్వకముందే ఆయన చైర్మన్ పదవి వదులుకోవాల్సి వచ్చింది.
కడప ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయిన అవినాష్ రెడ్డి అండదండలతోనే రెడ్డి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారన్న ప్రచారం జరిగింది.
ఈ పదవి కోసం ఎంతో మంది నేతలు పోటీ పడ్డారు. అయితే అవినాష్ రెడ్డి నేరుగా సిఫార్సు చేయడంతో జిల్లా ఎమ్మెల్యేలకు ఇష్టంలేకపోయినా మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు.
అయితే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కూడా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఎలాగైనా మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని పదవి నుంచి దింపేయాలి అని ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ వచ్చారు.
చివరకు కర్నూలు జిల్లా నేతలు అధిష్టానం వద్ద చేసిన లాబీయింగ్ ఫలించింది.
ఈ క్రమంలోనే వెంకట సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఒకానొక దశలో వెంకట సుబ్బారెడ్డి సీఎం జగన్ ను కలిసి తన పదవిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
పదవికి రాజీనామా చేయడానికి మూడు రోజుల ముందు అమరావతిలో మకాం వేసిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే జగన్ అపాయింట్మెంట్ దొరకక పోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేశారు.
ఏదేమైనా జడ్పీ చైర్మన్ అయ్యి ఏడాది కూడా ఆ పదవిలో కొనసాగకుండానే… మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి దిగిపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతుంది.
జిల్లాకు చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే తన బంధువులకు చైర్మన్ పదవి కట్టబెట్టుకునేందుకు మల్కిరెడ్డిని పదవి నుంచి దింపేయడంలో జిల్లా పార్టీ ఇన్చార్జ్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఈ విషయంలో తెరవెనక చాలా చక్రం తిప్పినట్టుగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది.