తన కాలికి దెబ్బ తగిలిందని, మూడు వారాల బెడ్ రెస్ట్ లో చూసేందుకు ఓటీటీ కంటెంట్ ను సూచించాలంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. జనం వరదలు, వర్షాలతో అతలాకుతలమవుతుంటే కేటీఆర్ సినిమాలు చూస్తున్నారంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. కుట్ర సిద్ధాంతం:క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్ళు, మరియు పంప్ హౌస్ లు అంటూ వెటకారమాడారు. దీంతో, షర్మిలపై కేటీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుబెట్టారు.
సెటైరికల్ గా సినిమాల పేర్లు సూచించిన తనపై కేటీఆర్ అభిమానులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ఒక మహిళ, పిల్లల తల్లి అయిన తనపై ఇటువంటి విమర్శలు చేయడానికి సిగ్గు లేదా అని షర్మిల మండిపడ్డారు. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన కామెంట్లకు కేటీఆర్ దిగొచ్చారు. ప్రతిపక్ష నేతల కుటుంబం, పిల్లలు, వారి వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయవద్దని టీఆర్ఎస్ శ్రేణులు, తన అభిమానులకు కేటీఆర్ సూచించారు.
రాజకీయ విమర్శల నుంచి నేతల పిల్లలను మినహాయిద్దాని కేటీఆర్ పిలుపునిచ్చారు. పిల్లలను అడ్డుపెట్టుకొని నేతలను టార్గెట్ చేయడం ఎంతమాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదని కేటీఆర్ అన్నారు. ఈ రాజకీయ రొంపిలోకి నేతల పిల్లలను లాగే దుష్ట సంస్కృతికి చరమ గీతం పాడదామంటూ తన సొంత పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేతలు, పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ తరహా సంస్కృతికి స్వస్తి చెప్పాలని కోరారు.
అంతేకాదు, ప్రతిపక్ష పార్టీలు, వైరి వర్గాల వారిని వారి సిద్ధాంతాలు, నిర్ణయాలు, పని తీరు ఆధారంగానే విమర్శిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. మరి, కేటీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్, కేేసీఆర్ అభిమానులు సైలెంట్ అవుతారా లేదంటే అదే దూకుడును కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి ఒక్క టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే కాదు…మిగతా పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా వైరి వర్గ నేతలు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనతో వారిలో కూడా మార్పు వస్తుందేమో వేచి చూడాలి.