ఆవేశం హద్దులు దాటుతోంది. రాష్ట్రానికి దిశా నిర్దేశంగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న పెద్ద మనిషి నోటి నుంచే అభ్యంతరకర భాష వస్తుంటే.. మిగిలిన వారు మరింతగా చెలరేగిపోరూ? రాజకీయాల్లో విమర్శలు ఓకే. కానీ.. వాటికో హద్దులు ఉండాలి.
తాజాగా చోటు చేసుకునే పరిణామాలు ఎంత ఇరిటేట్ చేస్తే మాత్రం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదు. మాటల్ని తనకు తోచినట్లుగా ఉపయోగించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.
ఉద్యమ వేళలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ‘లక్ష నాగళ్లతో దున్నుతాం’ అన్న మాట స్ఫూర్తిగా బండి సంజయ్.. కేసీఆర్ ఫాంహౌస్ ను దున్నుతామంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన గులాబీ బాస్.. అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థాయి తనకు ఏమాత్రం సరిపోదని.. అందుకే ఆయన మాటల్ని తాను పట్టించుకోలేదన్న కేసీఆర్.. వరుస ప్రెస్ మీట్లతో పొలిటికల్ హీట్ జనరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన డైలీ ప్రెస్ మీట్లలో భాగమైన రెండో రోజున తన పూర్తి టార్గెట్ బండి సంజయ్ మీదన.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీపైనే ఫోకస్ చేశారు.
బండి మాటలకు కేసీఆర్ స్పందిస్తూ ఆయన ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే.. ‘నీ ముక్కు బాగాలేదని ఒకడు..నీ ముడ్డి బాగాలేదని ఒకడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో ఏమేమో మాట్లాడినరు. నువ్వు మందు తాగుతవు అన్నావు. నీకు తెలుసా ? నువ్వు వచ్చిపోసినవా? ఎప్పుడైనా వచ్చి మందు కలిపినవా? అలా మాట్లాడవచ్చా? నీ గురువులు నేర్పిన సంస్కారం ఇదేనా? అందుకే కదా నీ మెడలు విరగ్గొడ్త అన్నది. దా.. నా ఫార్మ్ హౌజ్ కాడ అడుగు పెట్టు.. ఆరు ముక్కలవుతవు నా కొడకా.. నీలాగా గెస్ట్ హౌస్ లేదు. అది ఫార్మ్హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్. నా ఫార్మ్ హౌస్ దున్నతవా? నీ అయ్యదా నా ఫార్మ్ హౌస్. బాజప్తా కొనుక్కున్న భూములవి. ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తం. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా అత్తగారివి, మా భూములు పోయాయి..’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఫాంహౌస్ వద్దకు వస్తే ఆరు ముక్కలు చేస్తాం.. మెడలు విరగ్గొడ్త.. నా కొడకా.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం సరైనవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ‘నువ్వు రెండు అంటే నేను నాలుగు అంట’ అని ఇదే తరహాలో తిట్లను మొదలు పెడితే.. జరిగేదేమిటి?
హద్దులు దాటేలా ఎవరైనా మాట అంటే.. ముఖ్యమంత్రిలాంటి గౌరవ స్థానంలో ఉన్న వారి మీద ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నిస్తారు. మరి.. ప్రజాపాలన కోసం సీఎంను చేసిన వ్యక్తి.. ఇలా అగౌరవపూర్వకంగా వ్యాఖ్యలు చేయటంలో అర్థముందా?
మరి..రాజకీయ ప్రత్యర్థులు అన్న మాటలో అంటే.. వారికి సమాధానం చెప్పాలే కానీ.. ఆరు ముక్కలు చేస్తాం.. పన్నెండు ముక్కలు చేస్తాం లాంటి మాటల్ని.. పదాల్ని ప్రయోగించకూడదన్నది మర్చిపోకూడదు.
వేరే వాళ్లకు చెప్పేందుకే సుద్దులు అని ఊరకే అనలేదు.