ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. కేటీఆర్ తరఫున ఆయన లాయర్ మోహిత్ రావు సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేశారు. అయితే, కేటీఆర్ ఒక వేళ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని ముందస్తుగానే తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు, హైకోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందించారు. న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని, కానీ, సత్యమే ఎప్పటికీ గెలుస్తుందని ఆయన అన్నారు. కాలంతో పాటు సత్యం ప్రకాశిస్తుందని, నిరంతరం సత్యం కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎదురుదెబ్బలు తగిలినా బలంగా తిరిగివస్తానని కేటీఆర్ చెప్పారు. ఆలస్యంగానైనా సత్యమే ఎప్పుడు గెలుస్తుందని అన్నారు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయని చెప్పారు.
కాగా,కేటీఆర్ కు ఈడీ మరోసారి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులిచ్చింది. మరోవైపు, ఏసీబీ కూడా విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేయనుంది.