దాయి దాయి దామ్మా.. మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా.. లేలే లేలే.. ఇంతే ఇంతింతే.. చైలచైలా చైలా చైలా.. ఫీల్ మై లవ్.. ఏ మేరా జహా.. ఈ పాటల ప్రస్తావన వచ్చినంతనే.. ఇవన్నీ నాకిష్టమైన పాటలే అనుకోకుండా ఉండలేరు. సంగీతం మీద.. గాయకుల మీద అవగాహన ఉన్న వారందరికి సింగర్ కేకే గుర్తుకు వస్తారు. అలాంటి ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన.. తన గురుతుగా తన పాటల్ని మిగిల్చి వెళ్లిపోయారు.
అవును.. మంగళవారం ‘పాట’కు పాడు రోజు. తనను ఎంతగానో ప్రేమించి.. ఆరాధించి.. తన ప్రతిష్ఠను మరింత పెంచిన కొడుకును పాట పోగొట్టుకుంది. చివరి క్షణంలోనూ.. తానే శ్వాసగా సాగి.. కాలేజీలో ప్రదర్శన అనంతరం తీవ్రఅస్వస్థతకు గురి కావటం.. కాసేపటికే ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ ‘కేకే’ (క్రష్ణ కుమార్ కున్నత్) ఇక లేరు.
కోల్ కోతాలోని ఒక కాలేజీలో దాదాపు గంట పాటు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆయన అనంతరం తాను ఉంటున్న హోటల్ కు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రికి చేరే సమయానికి ఆయన ప్రాణం పోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో.. సంగీత ప్రపంచం ఒక్కసారి షాక్ తిన్నది. 53 ఏళ్ల ప్రాయంలో పాటకు తన గళంలో ప్రతిష్ఠను పెంచిన కేకే ప్రస్థానం ముగిసింది. అయితే.. ఆయన పాట మాత్రం ఇప్పటికి ఎప్పటికి మనతో సజీవంగా ఉండనుంది.
పాట ఏదైనా.. తన స్వరంతో కొత్త కిక్కు ఎక్కేలా చేసే గాయకుడు కేకే. అతడి ప్రతిభను ఒక్క చిన్న ఉదాహరణతో చెప్పాలంటే.. గాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్ల వ్యవధిలో 11 భాషల్లో అతను 3500 వాణిజ్య ప్రకటనల్లో తన గొంతును వినిపించారంటే.. అతడి స్వరానికి సాధించిన సక్సెస్ ఎంతన్నది ఇట్టే చెప్పొచ్చు.
అప్పటి ప్రేమదేశంలో.. ‘కాలేజీ స్టైలే..’ పాట కావొచ్చు.. ‘హెలో డాక్టర్ హార్ట్ మిస్సాయే’ అన్న పాట కావొచ్చు.. ఘర్షణ మూవీలో ‘చెలియ చెలియ’.. దేవుడే దిగి వచ్చినా (సంతోషం).. ‘గుర్తుకొస్తున్నాయి (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్).. పాటకు ప్రాణం పల్లవి ఐతే (వాసు).. పవన్ కల్యాణ్ సినిమాలకు అతను పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు.. అన్నింటికి తన స్వరంతో మరో స్థాయికి తీసుకెళ్లిన గాయకుడు కేకే.
1968లో ఢిల్లీలో జన్మించిన కేకే తల్లిదండ్రులు మలయాళీలు. ఢిల్లీలో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆర్నెల్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. గాయకుడిగా తన లక్ ను పరీక్షించుకునేందుకు 1994లో ముంబయికి వచ్చారు. చాలా తక్కువ సమయంలోనే తన ప్రతిభతో అందరిని మేజిక్ చేసిన అతను.. పాటను ఇష్టపడే వారికి అతడో డ్రగ్ గా మారిపోయాడు. అతని పాట లేని సినిమానే ఉండేది కాదన్నట్లుగా ఉండేది.
జింగిల్స్ చేస్తున్నప్పుడు కేకేకు ఏఆర్ రెహమాన్ పరిచయం కావటంతో ప్రేమదేశం మూవీలో పాడే అవకాశాన్ని కల్పించారు. ఆ సినిమాలో అతను పాడిన రెండు పాటలు (కాలేజీ స్టైలే.. హెలో డాక్టర్) సూపర్ హిట్ కావటమే కాదు.. అప్పటివరకు అలవాటైన గొంతులకు భిన్నంగా ఆయన గొంతు ఉండటం.. ఆయన పాడిన స్టైల్ అందరిని ఆకట్టుకునేలా చేసింది.
అలా మొదలైన అతని ప్రయాణం చివరి వరకు పాటతోనే సాగింది. తన గాత్రంతో అన్ని వయసుల వారిని ఆకట్టుకున్న ఆయన.. తెలుగువారికి గాయకుడిగా సుపరిచితుడు. ఒకవేళ పాటలు వినటమే తప్పించి.. సింగర్ల పేర్లను పట్టించుకోని వారికి.. ఆయన పాడిన పాటలు సుపరిచితం. తెలుగు.. తమిళం.. మలయాళం.. హిందీ ఇలా పలు భాషల్లో పాడిన కేకే.. తన గాన మాధుర్యంతో అందరిని ఆకట్టుకున్నారు.
గుండె పోటుతోనే ఆయన మరణించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. కేకే హఠాన్మరణం.. అందరిని షాక్ కు గురి చేసింది. ఆయనకు భార్య.. కుమారుడు.. కుమార్తె ఉన్నారు. ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు పలువురు ప్రముఖులు తమ సంతాపాన్నితెలియజేశారు.