ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ధాటికి హస్తం పార్టీ పత్తా లేకుండా పోయింది. కాషాయ దళం దెబ్బకు ఒక్కో రాష్ట్రం చేజార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న పంజాబ్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లోనే ఆ పార్టీ ఒంటరిగా అధికారంలో ఉంది. కానీ ప్రస్తుతం పార్టీలోని పరిణామాలు చూస్తుంటే అక్కడ అధికారాన్ని కాపాడుకోవడం కోసం కూడా కాంగ్రెస్ ఏ మాత్రం కసరత్తులు చేయడం లేదని తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు.. రాష్ట్రాల పీసీసీలో నాయకుల మధ్య అసమ్మతి, జాతీయ స్థాయిలో సమర్థమైన నాయకత్వం లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి.
అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గుజరాత్ పీసీసీ మేధోమథన శిబిరంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో పార్టీలోని కొంతమంది నేతలు కౌరవులుగా మారారని వాళ్లను బయటకు పంపించాల్సిన అవసరం ఉందని ఆయన సంచనల వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ నాయకులు ఎవరంటూ చర్చ మొదలైంది.
ప్రసంగాలకే పరిమితమవుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయకుండా ఇతరులను చెడగొడుతున్నారంటూ రాహుల్ ఫైర్ అయ్యారు. అటువంటి నాయకులను కౌరవులుగా అభివర్ణించారు. అవకాశం వచ్చినప్పుడు బీజేపీలోకి వెళ్లేది అలాంటి నేతలేనని వాళ్లను త్వరగా వదిలించుకోవడమే ఉత్తమనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆయన కౌరవులుగా పేర్కొన్న నేతలు ఎవరు? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గులాం నబి అజాద్, కపిల్ సిబాల్ లాంటి సీనియర్ నేతలు జీ-23గా ఏర్పడి కాంగ్రెస్‌లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యల కోసం అధినేత్రి సోనియాకు లేఖలు రాస్తున్నారు. అయితే వీళ్లపై రాహుల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో వాళ్లనే కౌరవులుగా ఆయన పేర్కొన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మరి దీనిపై రాహుల్ ఓ స్పష్టత ఇస్తారేమో చూడాలి.