వైసీపీ మాజీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు గురించి పరిచయం అక్కరలేదు. తన వ్యాఖ్యలతో, చేష్టలతో కొత్తపల్లి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. జిల్లా కేంద్రాన్ని భీమవరం నుండి నరసాపురానికి మార్చాలంటూ కొత్తపల్లి రచ్చ రచ్చ చేశారు. అంతకుముందు, ప్రసాదరాజును వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఇక, తాజాగా రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికైనా రెడీ అంటూ కొత్తపల్లి చేసిన కామెంట్లు వైసీపీలో కాక రేపాయి.
దీంతో, కొత్తపల్లిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే కొత్తపల్లిని వైసీపీ నుండి సస్పెండ్ చేసిన వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కొత్తపల్లిని పార్టీ నుంచి జగన్ సాగనంపడం చర్చనీయాంశమైంది. అయినా సరే తగ్గేదేలే అంటూ తాజాగా మరోసారి కొత్తపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చారు.
తన సస్పెన్షన్కు కారణమేంటో చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అంటూ వైసీపీ హైకమాండ్ కు అల్టమేటం జారీ చేశారు. తాను వైసీపీని ఒక్క మాట కూడా అనలేదని, ఏ తప్పు చేయకుండానే తనపై వేటు ఎందుకు వేశారని ప్రశ్నించారు. తానేం తప్పు చేశానో చెప్పాలని నిలదీశారు. అంతేకాదు, పార్టీపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్ వేటు ఎందుకు వేయలేదని కూడా కొత్తపల్లి ప్రశ్నించారు.
ఇక, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమని కొత్తపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సస్పెన్షన్కు గల కారణాలను గురువారం సాయంత్రం నాటికి మీడియాకు విడుదల చేయాలని వైసీపీని డిమాండ్ చేశారు. మరి, కొత్తపల్లి అల్టిమేటంపై వైసీపీ అధినేత జగన్ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.