వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులపై అ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సజ్జలపై గతంలో కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. అనిల్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిరించారని, ఆ వ్యక్తి సజ్జల కోటరీకి చెందిన వాడని తనకు తర్వాత తెలిసిందని అన్నారు. సజ్జల నాకు ఇలాంటి కాల్స్ చేస్తే నీకు నెల్లూరు రూరల్ నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తుల బెదిరింపులకు బెదిరే రకం తాను కాదని అన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల డైరెక్షన్లోనే పోలీసులు నడుచుకుంటున్నారని, ఆయన ఆదేశాలతోనే తన అనుచరులపై కేసు నమోదు చేశారని, అరెస్టు చేశారని కోటంరెడ్డి మండిపడ్డారు. తన అనుచరులు తాటి వెంకటేశ్వర్లు, జావెద్ లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెగేసి చెప్పారు.
వైసిపి అధిష్టానంపై తన పోరు కొనసాగుతుందని కోటంరెడ్డి కుండబద్దలు కొట్టారు. తన అనుచరులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళకుండా హైవేపై తిప్పారని, సజ్జల ఆదేశాల ప్రకారమే వారు ఇలా చేశారని ఆరోపించారు. తనతో పాటు 11 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, అయినా సరే పోలీసుల వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పోరాడుతూనే ఉంటానని తగ్గేదేలే అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా కోటంరెడ్డి సవాల్ చేశారు.