జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో ‘అదుర్స్’ మూవీది ప్రత్యేక స్థానం. పెద్ద మాస్ హీరో అయిన తారక్.. అందులో కామెడీ పండించిన తీరును ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ఇందులో డ్యూయల్ రోల్ చేసినప్పటికీ.. జనాలకు ఎప్పటికీ గుర్తుండేది బ్రాహ్మణ కుర్రాడు చారిగా తారక్ తిరుగులేని కామెడీ పండించిన క్యారెక్టరే. అదుర్స్ మూవీకి సీక్వెల్ తీయాలని దర్శకుడు వి.వి.వినాయక్ అప్పుప్పుడూ చెప్పేవాడు.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఐతే ఇప్పుడు రైటర్ కోన వెంకట్ ‘అదుర్స్’ సీక్వెల్ గురించి మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన రైటింగ్, ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు.
ఇటీవలే శ్రీను వైట్ల ‘వెంకీ-2’ తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘వెంకీ’ రైటర్లలో కోన వెంకట్ కూడా ఒకరు. మరి ఈ సీక్వెల్లో మీరు భాగం అవుతారా అని కోనను అడిగితే.. ‘వెంకీ-2’ సంగతి తెలియదు కానీ.. ‘అదుర్స్-2’ మాత్రం తప్పకు చేస్తామని వెంకట్ ప్రకటించాడు.
అదుర్స్‌లో చారి పాత్రను తారక్ తప్ప ఇంకెవరూ చేయలేరని.. ఆ పాత్రలో గొప్పగా కామెడీ పండించాడని.. ఆ పాత్ర ఆహార్యం, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయని కోన అన్నాడు. అదుర్స్-2 చేస్తే తారకే చేయాలని.. తాను అవసరమైన ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకుని, ఎన్టీఆర్ లాగే పిలక పెట్టుకుని నిరాహార దీక్ష చేసి అయినా సరే సీక్వెల్ కోసం ఒప్పిస్తానని కోన అన్నారు. దర్శకుడెవరు అంటే.. వినాయకే చేయాలని, వినాయక్ పేరుకి మాస్ డైరెక్టరే అయినా కామెడీని చాలా బాగా డీల్ చేయగలడని.. ఆయనతోనే అదుర్స్-2 తీయిస్తానని కోన ధీమా వ్యక్తం చేశారు.