పార్టీ అంటే తనకు మించిన విధేయత మరెవరికీ లేదన్నట్లు తరచూ చెప్పుకునే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటి నుంచి సంచలన వ్యాఖ్య ఒకటి వచ్చింది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా వ్యవహరిస్తున్న ఆయన.. తరచూ ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తుండటం.. పార్టీని.. పార్టీకి చెందిన నేతల్ని ఇరుకున పెట్టే విషయంలో ఆయనకు ఆయనే సాటి అన్న సంగతి తెలిసిందే. అలాంటి కోమటిరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ కుదేలు అయ్యే మాట ఒకటి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ కలవక తప్పదని.. బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి 60 సీట్లు రావని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది హంగ్ ప్రభుత్వమే అని చెప్పారు. మార్చి ఒకటో తేదీ నుంచి తాను పాదయాత్ర.. బైక్ యాత్ర చేస్తానని చెప్పిన ఆయన.. కాంగ్రెస్ గాడిలో పడుతుందని చెప్పుకొచ్చారు. రేవంత్ ను టీ కాంగ్రెస్ రథసారధిగా నియమించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలెత్తింది.
అయితే.. కాంగ్రెస్ సీనియర్లు వీహెచ్.. కోమటిరెడ్డి.. జగ్గారెడ్డి లాంటి కొందరు రేవంత్ తీరు నచ్చక బాహాటంగా విమర్శలు చేయటంతో ఆయన కాస్తంత కామ్ అయ్యారు. ఇటీవల పాదయాత్ర మొదలు పెట్టటం ద్వారా మళ్లీ పార్టీలో ఊపును తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన పాదయాత్రలో భాగంగా ప్రగతిభవన్ ను పేల్చేయాలన్న సంచలన వ్యాఖ్య చేయటం ద్వారా ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. పార్టీకిసైతం ఇప్పుడిప్పుడే ఉత్సాహం వస్తున్న వేళ.. ఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్.. బీఆర్ఎస్ తోకలుస్తుందని చెప్పటం ద్వారా.. పార్టీకి భారీ దెబ్బ వేశారన్న మాట వినిపిస్తోంది.
ఎన్నికల వేళ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేని వేళ.. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ వెళుతుందన్న మాట చెప్పటం ద్వారా.. ప్రజలు కన్ఫ్యూజన్ కు గురై.. పార్టీకి వేయాల్సిన ఓటును ప్రత్యర్థి పార్టీలకు వేస్తే.. ఫలితం ఎలా మారుతుందన్న చిన్న విషయం కోమటిరెడ్డికి తెలీదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏమైనా తన మాటలతో నేతలకుచికాకు పెట్టే కోమటిరెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్య ఆయన పార్టీకి ఇబ్బందులకు గురి చేయటం ఖాయమంటున్నారు.