ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికలో.. గెలు పు గుర్రం ఎక్కడం తథ్యమని.. భావిస్తున్న టీఆస్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పెద్ద షాకిచ్చారు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ.. ఫైర్ బ్రాండ్ నేత.. కోమటి రెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఫైట్ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు, ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధించి.. పార్టీని వదిలి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మధ్యే జరగనుంది.
ఈ క్రమంలో ఇక్కడ ఎవరు గెలుస్తారు.. అనే అంచనాలు పీక్కు చేరుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ డబ్బులతో ఇక్కడ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, ఈ వ్యాఖ్యలను సైతం కేసీఆర్ ఏమాత్రం లెక్కచేయడం లేదు. దళిత బంధు పేరుతో దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పంచేందుకు ఆయన రెడీ అయ్యారు. ఇక, నియోజకవర్గానికి రూ.2000 కోట్లు కూడా కేటాయించినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ ఎస్ వ్యూహం.. అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మరోవైపు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తన పాదయాత్రతో దూకుడు పెంచారు. ఇంటింటికీ తిరుగు తున్నారు. తనకు అన్యాయం జరిగిందని వివరిస్తున్నారు. దీంతో ఈటలపై సానుభూతి పాళ్లు పెరుగుతు న్నాయి. ఈ క్రమంలో అటు కేసీఆర్ పథకాల వ్యూహం.. ఇటు ఈటలపై సానుభూతి.. ఏది ఇక్కడ ఫలిస్తుందనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే అసలు హుజూరాబాద్ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారు.. అనే కాన్సెప్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సర్వే చేయించారట.
తాజాగా ఈ సర్వతాలూకు విషయాన్ని వెంకటరెడ్డి స్వయంగా వెల్లడించారు. హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ కు అనుకూల వాతావరణం ఉందన్నారు. మొత్తగా 64 శాతం మంది ఆయనకు మొగ్గు చూపుతుండగా, టిఆర్ఎస్ కు 30 శాతమే సానుకూలత ఉందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ కు కేవలం ఐదు శాతం ఓట్లే వచ్చేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే.. టీఆర్ ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాత.. పరిస్తితి కొంత మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, వ్యతిరేక ఓట్లు చీలకుండా కాంగ్రెస్ చూసుకోవాలని ఆయన అన్నారు.