మునుగోడు ఉప ఎన్నిక పోరు…మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. బై పోల్ లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ప్రత్యర్థులను ఇరకాటంలో నెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత ఒకరితో మంత్రి కేటీఆర్ మద్దతు కోరుతూ మాట్లాడుతున్న ఫోన్ కాల్ లీక్ కావడం సంచలనం రేపింది. ఆ ఎపిసోడ్ మరువక ముందే తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం సంచలనం రేపుతోంది.
మునుగోడు బై పోల్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటిదాకా ప్రచారానికి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో, పరోక్షంగా ఆయన తమ్ముడు రాజగోపాల్ కు మద్దతు తెలుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా తాజాగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు వెంకట్ రెడ్డి చెప్పారంటూ ఓ ఆడియో లీక్ అయింది. సదరు ఆడియోలో పలువురు కాంగ్రెస్ నేతలతో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… పార్టీలను పక్కనపెట్టి రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని కోరారు. అలా చేసే క్రమంలో ఏ ఇబ్బంది వచ్చినా తానే చూసుకుంటానని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.
అంతేకాదు, ఈ దెబ్బతో తాను పీసీసీ చీఫ్ అవుతానని కూడా వెంకట్ రెడ్డి అనడం సంచలనం రేపుతోంది. రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని, రాష్ట్రానికి సీఎంను కూడా అవుతానని వెంకట్ రెడ్డి చెప్పడం విశేషం. అయితే,సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోపై ఇప్పటిదాకా వెంకట్ రెడ్డి స్పందించలేదు. కుటుంబంతో కలిసి ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి..మరో 10 రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారని తెలుస్తోంది. ఆయన వచ్చిన తర్వాత ఆ ఆడియో లీక్ పై స్పందిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.