తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. నల్లగొండ జిల్లాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అమ్మిన చరిత్ర కోమటిరెడ్డి సోదరులదని జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. జిల్లా ఓట్లను రాజశేఖర్ రెడ్డికి తాకట్టు పెట్టారని, కృష్ణానది నీళ్లలో కూడా నల్లగొండ జిల్లా వాటాను తీసుకుపోయి వైఎస్‌కు అమ్ముకొని పైసలు సంపాదించిన దొంగలని జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
2004లో వాళ్ల బతుకులేందో… తరువాత వాళ్ల బతుకులేందో స్పష్టంగా కనిపిస్తోందని, ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా అని జగదీశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గానికే రాకుండా ప్రొటోకాల్ పేరుతో రాద్ధాంతం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 10వేల మందిని తెచ్చి సభను అడ్డుకుంటామన్నారని, 10 మందిని తెచ్చే దమ్ములేదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో జగదీశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తమ జిల్లా మంత్రి జగదీశ్ చాలా చిన్న మనిషి అని, ఆయనకు మంత్రి పదవి చాలా పెద్ద పోస్ట్ అని రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న కార్యక్రమాలను మండల స్థాయిలో చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలు రావాలని, కానీ వాటికి కూడా మంత్రి హాజరవుతాననడం హాస్యాస్పదమన్నారు. రెండున్నరేళ్లుగా ఇదే జరుగుతోందని, ముందుగా తనతో మాట్లాడి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయించి జగదీశ్ కు ఇష్టమొచ్చిన రోజు పెట్టించారని ఆరోపించారు. జగదీశ్ ది ఎమ్మెల్యే స్థాయి కూడా కాదని, చాలా చిన్నోడని, సర్పంచ్ స్థాయి అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి బద్రర్స్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. కోమటిరెడ్డి సోదరులను సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని, వారిద్దరూ ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని దుయ్యబట్టారు. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦ అని, వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుందని విమర్శించారు.