నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాని, ఈ ప్రకారం ఆల్రెడీ ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ రాజీనామా ఎపిసోడ్ లో సస్పెన్స్ కు రాజగోపాల్ రెడ్డి తెరదించారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
తన రాజీనామాకు సంబంధించి సంచలన నిర్ణయం వెలువరించిన రాజగోపాల్ రెడ్డి..ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలపై, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీన పడిందని, అందుకే పార్టీలో ఉండి కూడా తాను ఏమీ చేయలేకపోయానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
తన జిల్లాలోనే అవకాశవాద రాజకీయాలు చేసే నేతలున్నారని, కాంట్రాక్టుల కోసమే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. అలా ప్రచారం చేస్తున్న కొందరిపై ఆరోపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన రాజీనామా వల్ల మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
కొద్దిరోజుల నుంచి తన రాజీనామాపై చర్చ జరుగుతోందని, కానీ, ఈ చర్చను ఉద్దేశ్యపూర్వంగా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉందని చెప్పారు. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడటం బీజేపీకి మాత్రమే సాధ్యమని తెలిపారు. మోడీ, షాలతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటూ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు అనధికారికంగా ప్రకటించారు. రెండ్రోజుల్లో స్పీకర్ కు రాజీనామా సమర్పిస్తానని అన్నారు. పార్టీ మారేముందు తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో చర్చించానని చెప్పారు.