తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి….ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి టికెట్ రాని నేతలు జంప్ చేయడం సర్వసాధారణం. కానీ, కచ్చితంగా ఒక పార్టీలో ఉంటారని ఫిక్స్ అయిన సీనియర్ నేతలు కూడా ఆఖరి నిమిషంలో పార్టీలు మారుతున్న వైనం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారి తీసింది.
బిజెపికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ప్రకటించడం షాకింగ్ గా మారింది. అయితే, బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి బలమైన కారణముందని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. కార్యకర్తలే తన బలమని, అభిమానులు, కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే తాను పార్టీ మారుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్ లో చేరడం హాట్ టాపిక్ గా మారింది.
మునుగోడు ఉప ఎన్నికకు వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అధికార పార్టీకి బిజెపి ప్రత్యామ్నాయమని గతంలో ప్రచారం చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంటూ సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డిపై ట్రోలింగ్ జరుగుతుంది.