అమెరికాలో జరుగుతున్న TANA 23వ మహాసభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ చేసిన ఒక వ్యాఖ్య పార్టీకి మైలేజ్ తీసుకురాగా..మరో వ్యాఖ్య భారీ డ్యామేజీ చేసింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం అయ్యే చాన్స్ ఉందని రేవంత్ చేసిన కామెంట్లు ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయగా…. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదని, 3 గంటల ఉచిత విద్యుత్ చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 8 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తామని, 3 ఎకరాలు తడిపేందుకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కమిషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్….ఉచిత విద్యుత్ పథకాలు పెడుతున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రేవంత్ కామెంట్స్ పై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. సీతక్క సీఎం అనేది పెద్ద జోక్ అని, అది నిర్ణయించడానికి రేవంత్ ఎవరని అన్నారు. సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ ఏ సందర్భంలో మాట్లాడారో తెలీదని, కానీ, అది సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ గా, సీనియర్ నేతగా …తెలంగాణలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నానని అన్నారు.
సీతక్క సీఎం అని చెబుతున్నారని, కానీ, దళిత అభ్యర్థి సీఎం కావాలంటే…భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ, పోదాం వీరయ్య వంటి ఎందరో సీనియర్ నేతలున్నారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ అయినా, సీఎం అభ్యర్థి అయిన రేవంత్ చెబితే సరిపోదని, కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించాలని అన్నారు. మరోవైపు, రేవంత్ పై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉచిత విద్యుత్ ఇస్తే రేవంత్ కు బాధేంటని ప్రశ్నించారు. రైతులపై కాంగ్రెస్ కు కక్ష ఎందుకని నిలదీశారు.
వ్యవసాయాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు రేవంత్ వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసే ముందు రైతులు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అనుమతితో తాను మాట్లాడతానని రేవంత్ చెప్పారని, ఉచిత విద్యుత్ మాటలు కూడా రాహుల్ గాంధీకి తెలిసే మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.