నెల్లూరు జిల్లాలోని కందుకూరు టీడీపీ రోడ్ షోలో జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఎన్ఆర్ఐ టీడీపీ అమెరికా కన్వీనర్, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి స్పందించారు.
మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 8 లక్షల సహాయాన్ని ఆయన ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని.. ఆ కుటుంబాలకు ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నామని జయరాం కోమటి తెలిపారు.
కేవలం ఆర్థిక సహాయం అందించడంతో సరిపెట్టకుండా మృతుల పిల్లల చదువు విషయంలోనూ అవసరమైన సహకారం అందిస్తామని.. వాళ్లు విదేశాలలో చదువుకుంటామన్నా తమ సహకారం ఉంటుందని జయరాం కోమటి భరోసా ఇచ్చారు.
అలాగే, కందుకూరు ఘటనపై గంపా కృష్ణ కూడా విచారం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.
కాగా కందుకూరు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
ఈ ఘటనలో మరణించిన ఓగురుకు చెందిన మధు ఇంటికి చంద్రబాబు వెళ్లారు.
మృతుడి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కందుకూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.