కోల్ కతా మహానగరానికి చెందిన ఒక వైద్యురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రోజువారీ అవసరాల కోసం బైక్ రైడ్లను వినియోగించటం పెద్ద నగరాల్లో మామూలే. అందులో భాగంగా అలానే బైక్ రైడ్ బుక్ చేసి.. తర్వాత క్యాన్సిల్ చేసిన దానికి బదులుగా పెద్ద ఎత్తున వేదింపు ఫోన్ కాల్స్.. అసభ్యకరమైన వీడియోల్ని పంపి వేధింపులకు గురి చేశాడు. ఆమె ధైర్యం చేసి పోలీసుల్ని సంప్రదించటంతో ఆ శాడిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
కోల్ కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న మహిళ ఇంటికి వెళ్లేందుకు బైక్ రైడ్ ను బుక్ చేశారు. రాత్రి వేళ బైక్ రైడ్ బుక్ చేసి.. ఎంత వెయిట్ చేస్తున్నా స్పందన రాకపోవటంతో ఆ రైడ్ ను క్యాన్సిల్ చేశారు. దీంతో సదరు బైక్ రైడర్ 17 సార్లు ఫోన్ చేయటమే కాదు.. ఆమె వాట్సప్ నెంబరుకు అశ్లీల వీడియోలు పంపాడు. అంతేకాదు.. తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలకు దిగాడు.
దీంతో.. భయాందోళనలకు గురైన సదరు మహిళా డాక్టర్.. వెంటనే పోలీసుల్ని సంప్రదించారు. తొలుత నగర పోలీస్ కమిషనర్ కు ఆన్ లైన్ వేదికగా.. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి.. నిందితుడి ఆచూకీని ట్రేస్ చేశారు. అనంతరం అతడ్ని అదపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఈ తరహా ఘటనల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పకతప్పదు.