కేంద్ర మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తారక్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొడాలి నాని…ఈ సందర్భంగా ప్రధాని మోడీ, అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఉపయోగం లేదనుకుంటే ఏ ఒక్కరితోనూ ఒక్క నిమిషం పాటు కూడా మాట్లాడేందుకు మోడీ, షాలు ఇష్టపడరంటూ నాని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఆంధ్రాతో పాటు తెలంగాణలోనూ బీజేపీని విస్తరించేందుకే తారక్ తో షా భేటీ అయ్యారని కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కుదిరితే బీజేపీని అధికార పార్టీగా లేదంటే ప్రతిపక్ష పార్టీగా నిలబెట్టేందుకే అమిత్ షా, మోడీలు అహర్నిశలు ఆలోచిస్తుంటారని కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే తారక్ తో షా భేటీ అయ్యారని కొడాలి నాని అన్నారు. అమిత్ షా, మోడీలు ఎవరిని పిలిపించుకుని మాట్లాడిన అది రాజకీయ భేటీనే అవుతుందని, అభినందించడానికి కాదని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్తగా సినిమాలు చేయడం లేదని, దాదాపు పాతిక సినిమాల్లో నటించారని చెప్పుకొచ్చారు. వాటిల్లో చాలా చిత్రాల్లో అద్భుతంగా నటించాడని, అవి హిందీలో కూడా డబ్ అయ్యాయని చెప్పారు.
అంతేకాదు, ఆ సినిమాలు షా చూసే ఉంటారని, అప్పుడు ప్రసంసించని వాళ్ళు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చూసి ప్రశంసించడం నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. దీంతో, కొడాలి నాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.