ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పరిస్థితి ఇలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్‌ను కలిసేందుకు ప్రయత్నించడం.. అది జగన్ వరకు వెళ్లడంతో చివరకు ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నానికి ఎదురైందని టాక్. కొంతకాలంగా నాని సైలెంట్‌గా ఉంటున్నారు. ఎక్కడా, ఎవరిపై, ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.
ఇప్పుడేమో ఉన్నట్లుండి గుడివాడలో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్‌పై ఎప్పట్లాగే తీవ్ర విమర్శలు చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు. అయితే ఈ ప్రెస్‌మీట్‌లోనే పవన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు చాలా ప్రయత్నించానని, కానీ కుదరలేదని నాని చెప్పారు. చంద్రబాబు ఎలాగో గెలవరని, ఆయనకు మద్దతుగా ఉండొద్దని చెప్పేందుకు పవన్‌కు కలవాలనుకున్నానని నాని అన్నారు. కానీ కుదరకపోవడంతో మీడియా ద్వారా చెబుతున్నానన్నారు.
కానీ పవన్‌ను నాని కలవాలనుకోవడం వెనుక ఏదో దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం జగన్ వరకూ చేరడంతో తనకు ముప్పుగా మారకూడదనే వివరణ ఇచ్చుకునేందుకు నాని ప్రెస్‌మీట్ పెట్టి పవన్‌పై విమర్శలు చేశారని టాక్. పవన్‌ను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించానో అని జగన్‌కు అర్థమయ్యేలా చెప్పడమే నాని ఉద్దేశమని తెలిసింది. కానీ పవన్ ఎలా పోతే నానికి ఏంటీ? బాబు ఎలాగో గెలవడనే నమ్మకంతో ఉన్న ఆయన.. పవన్‌ను ఎందుకు కలవాలనుకున్నాట్లు అనే సందేహాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. తెరవెనుక ఏదో జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.