తుఫాను గాలుల నడుమ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడపగడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఆరంభం అయింది. ఇక్కడి నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగనుంది అని చెబుతున్నారు సీఎం. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పనితీరు, పథకాలు అందుతున్న తీరు ఇలా అన్నింటినీ సంబంధిత లబ్ధిదారులను నేరుగా కలిసి అడిగి తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.ఇదంతా బాగానే ఉంది కానీ అనుకూలత అన్నది ఉందా ? ఉంటే ఎలా ఉంది ? అన్నది చూద్దాం.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 70కిపైగాసీట్లు ఒంటరిగానే సాధిస్తాం అని జనసేన చెబుతోంది. ఆవిధంగా జగన్ సేనకు సవాళ్లు విసురుతోంది.తమకు ఎవ్వరితోనూ పొత్తులు వద్దని, తమ ఉద్దేశం అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడడమేనని అంటున్నారు వీళ్లు. దీంతో పొత్తులపై క్లారిటీ లేదు. బీజేపీతో జనసేన వెళ్లినా 2019 రిజల్ట్ రిపీట్ అవ్వడం ఖాయమని కొందరు పరిశీలకులు అంటున్నారు. పోనీ టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఫలితాలు అన్నీ చంద్రబాబుకు అనుకూలం అవుతాయే తప్ప తమకు లాభించే అంశం ఒక్కటి కూడా లేదన్నది వారి వాదన.
బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా తమను పట్టించుకోకపోయినా వారితో పెద్దగా వైరం కోరుకోకపోవడమే జగన్ చేసిన పని. అంటే పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ప్రస్తుతం జగన్ ఉన్నారు అన్నది ఓ విపక్ష వర్గం విశ్లేషణ. కేసీఆర్ మాత్రం పైకి బాగానే అరుస్తూ ఉన్నా ఆయన కూడా పార్టీ ప్రయోజనాలనకే ప్రాధాన్యం ఇస్తారు అని కాంగ్రెస్ చేస్తున్న ఓ ఆరోపణ. అంటే బీజేపీతో స్నేహంలో ఆ రెండు పార్టీలూ కాస్త సమతుల్యతను పాటిస్తున్నాయనే చెప్పాలి.
పొత్తులను హేళన చేస్తూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. పొత్తులుంటే జగన్-కు ముందున్న కాలంలో అనుకున్న ఫలితాలు అందుకోవడం సాధ్యం కాని పని. విపక్ష నేతలయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడతామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా, విడిగా పోటీచేసినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, ఆ రోజు తాము గెలుచుకున్న విధంగా 151సీట్లు పక్కగా తిరిగి తమ పార్టీ ఖాతాలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు మిగిలిన 24 సీట్ల కోసమే పోరాడాలని పునరుద్ఘాటిస్తూ, తనదైన ధోరణిలో ఇవాళ గుడివాడలో మాట్లాడారు.