కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీపై దండయాత్రకు వచ్చారు. రాజకీయ శత్రువును చీల్చి చెండాడడానికి విచ్చేశారు.
ఆయనకు ప్రధాని మోదీనే ఆ కార్యాన్ని పురమాయించారు. కేంద్ర పార్టీ డైరెక్షన్లో కిషన్ ‘జన ఆశీర్వాద యాత్ర’ చేపట్టారు.
కేంద్ర మంత్రి వస్తున్నారని కమలదళం కదనోత్సాహంతో ఉరకలెత్తింది. దైవదర్శనాలు గట్రా అయిపోయాక.. బెజవాడలో సభ పెట్టి ఏపీ సర్కారుపై అటాక్‌కు దిగారు. జగన్‌రెడ్డిపై కిషన్‌రెడ్డి ఎంత తీవ్రంగా దాడి చేస్తారోనని ఏపీ బీజేపీ చెవులు రిక్కరించి వింటోంది.
రోమాలు నిక్కబొడిచే స్పీచ్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ, మనోడు జగన్‌రెడ్డి పాలనపై కమలం పువ్వులతో దాడి చేశారు. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చేయి అనే టైప్‌లో ‘జన ఆశీర్వాద యాత్ర’ నాటకం రక్తికట్టించే ప్రయత్నం చేశారు.
“కేంద్ర పథకాలు మినహా ఏపీలో అభివృద్ధి జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఏపీకి కరోనా సాయం అందించాం. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి”. ఇంతే. ఇలా చప్పగా సాగింది కిషన్‌రెడ్డి ప్రసంగం. అంతకు మించి జగన్‌రెడ్డి పాలనను పళ్లెత్తు మాట కూడా అనలే. ఏపీలో ‘జన ఆశీర్వాద యాత్ర’ను మమ అనిపించి మంగళం పాడేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పార్టీ తనకు అప్పగించిన కీలక టాస్క్‌ను ఇలా సింపుల్‌గా ముగించేశారు.
అక్కడితో అయిపోలేదు కిషన్‌రెడ్డి గారి కమలనాటకం.
అసలైన ఇంట్రెస్టింగ్ సీన్ ఆ తర్వాత జరిగింది. కేంద్రం ఆదేశించింది ఏంటి? ఇతగాడు చేసిందేంటి?
కేంద్రమంత్రులంతా ఆయా రాష్ట్రాలకు వెళ్లి ‘జన ఆశీర్వాద యాత్ర’ చేపట్టి, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడం.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడం.. ఆ యాత్ర లక్ష్యం. కానీ, కిషన్‌రెడ్డి గారు మాత్రం ఏపీ విషయంలో తన ‘రెడ్డి’ బుద్ధి చూపెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎందుకంటే, ‘జన ఆశీర్వాద యాత్ర’ సభ తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తాడేపల్లిలోని సీఎం జగన్‌రెడ్డి ప్యాలెస్‌కు వెళ్లి.. కుటుంబ సమేతంగా ఆతిథ్యం స్వీకరించడం బీజేపీ శ్రేణులను అవాక్కయ్యేలా చేస్తోంది.
స్వయాగా కిషన్‌రెడ్డే జగన్ ఇంటికి వెళ్లడం ఏంటి? ఆయనతో శాలువా కప్పించుకోవడం ఏంటి? అందమైన మెమెంటో స్వీకరించడమేంటి? ఒకే డైనింగ్ టేబుల్‌పై కూర్చొని.. ఫ్యామిలీ డిన్నర్ చేయడం ఏంటి? ఏంటి.. ఇదంతా ఏంటి? అంటూ మండిపడుతున్నారు కమలనాథులు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వచ్చిన పనేంటి? ‘జన ఆశీర్వాద యాత్ర’ తో చేధించాల్సిన టార్గెట్ ఏంటి? చేతులెత్తేసినట్టు చేసిన చెత్త పని ఏంటి? అంటూ సొంతపార్టీ నేతలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
అదే కిషన్‌రెడ్డి కొన్నిగంటల వ్యవధిలోనే తెలంగాణలో అడుగుపెట్టి.. కేసీఆర్‌ను, కేసీఆర్ సర్కారును ఓ రేంజ్లో కుమ్మేశారు.
కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని.. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని.. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని.. కేటీఆర్‌కు సీఎం కుర్చీ కోసం కేసీఆర్ అడ్డదారులు తొక్కుతున్నారని.. సీఎం కేసీఆర్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ చాలా స్ట్రాంగ్‌గా అటాక్ చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
ఇది కదా కావాల్సింది. ఇలాంటి మాటలే కదా బీజేపీని నిలబెట్టేది.
మరి, ఈ విమర్శలు కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్రమే చేశారేంటి? ఏపీ సీఎం జగన్‌రెడ్డిని ఏమీ అనకపోవడమే కాకుండా.. మరింత దిగజారినట్టు.. ఆయనింటికే ఈయనెళ్లి.. భోజనానికి కక్కుర్తి పడటమేంటి? అని ఏపీ బీజేపీ లోలోన కిషన్‌రెడ్డిపై మండిపడుతోంది.
జాగ్రత్తగా గమనిస్తే.. కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి చేసిన పలు విమర్శలు జగన్‌రెడ్డికే ఎక్కువ వర్తిస్తాయి.
ఏపీని దివాళా తీయిస్తున్నది జగన్‌రెడ్డి.. ఏపీలో ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్‌రెడ్డిది.. అడ్డగోలు పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నది జగన్‌రెడ్డి.. ఇవి కాక.. ఏపీలో బీజేపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది వైసీపీ.. ఏపీలో మతమార్పిడిలు మునుపెన్నడూ లేనంతగా జరుగుతున్నాయి.. రెండేళ్లుగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు.. దళితులపై, ఆడపిల్లలపై దాడులు.. కేసులు, అరెస్టులతో అరాచకం.. సహజ సంపదల దోపిడీ.. ఇలా అరాచకానికి కేరాఫ్‌గా మారిన జగన్‌రెడ్డిపై కిషన్‌రెడ్డి గారు ఎనలేని ప్రేమ కనబరుస్తూ.. ఇంటికెళ్లి మరీ విందారగించడం.. అదే సమయంలో మరో సీఎం కేసీఆర్‌పై మాత్రం కస్సుమని బుసలుకొట్టడం.. ఇదేమీ ‘రెడ్డి రాజకీయం’ కిషన్‌రెడ్డి గారూ అంటూ సోషల్ మీడియాలో కేంద్రమంత్రిని చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు.
ఒక సీఎంకు షాక్ ట్రీట్మెంట్.. ఇంకో సీఎంకు ఆశీర్వాదమా? అని నిగ్గదీసి అడుగుతున్నారు. ఈ తేడా ఎందుకో కిషన్’రెడ్డి’ గారే చెప్పాలని నిలదీస్తున్నారు.
కేంద్రం ఏపీపై ఆగ్రహంగా ఉంది. ఏపీ చేస్తున్న అప్పులపై మండిపడుతోంది. కొత్త అప్పులు చేయకుండా చెక్ పెడుతోంది.
జగన్ అండ్ కో కు అడగ్గానే అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటోంది.
అటు, సీబీఐ సైతం జగన్ విషయంలో సపోర్ట్‌గా కాకుండా న్యూట్రల్‌గా ఉండేలా చేసింది. ఇలా కేంద్రం, కేంద్ర బీజేపీ జగన్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంటే.. కిషన్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి లాంటి కొందరు ‘రెడ్డి’ నాయకులు మాత్రం జగన్’రెడ్డి’తో అంటకాగుతున్నారనే విమర్శ ఉంది.
సీఎం కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ విరుచుకుపడటం.. సీఎం జగన్‌కు మాత్రం ఇంటికెళ్లి మరీ ఆశీర్వాదం ఇచ్చిరావడం.. కిషన్‌రెడ్డి-జగన్‌రెడ్డిల ‘రెడ్డి’ రాజకీయానికి నిదర్శనం అంటున్నారు.
ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడుతున్న బీజేపీకి.. కిషన్‌రెడ్డి పర్యటన గొడ్డలిపెట్టులా మారిందంటూ కమలనాథులే మండిపడుతున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.